
ఓర్పుకు మారుపేరు..మార్పుకు మార్గదర్శి
అమ్మ మనకు ఉనికిని ఇస్తే నాన్న విలువను కల్పిస్తాడు. అమ్మ నవమాసాలు మోసి ఇంటిని చక్కదిద్దేందుకు శ్రమిస్తే నాన్న ఆ తల్లీబిడ్డలకు రక్షణగా నిలిచేందుకు జీవితాన్ని అర్పిస్తాడు.
గెలిచినపుడు పదిమందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి.. ఓడినపుడు భుజంపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే మనిషి నాన్న ఒక్కడే.
నేడు ఫాదర్స్‌డే
కడప కల్చరల్ : అమ్మ మనకు ఉనికిని ఇస్తే నాన్న విలువను కల్పిస్తాడు. అమ్మ నవమాసాలు మోసి ఇంటిని చక్కదిద్దేందుకు శ్రమిస్తే నాన్న ఆ తల్లీబిడ్డలకు రక్షణగా నిలిచేందుకు జీవితాన్ని అర్పిస్తాడు. అమ్మకు కష్టమొస్తే నాన్నకు చెప్పుకుంటుంది. అది వీలుకాకుంటే చాటుగా కన్నీళ్లు పెట్టుకుని హృదయ భారాన్ని దించుకుంటుంది. కానీ, తండ్రికి ఆ అవకాశమూ ఉండదు. ఇంటా, బయటా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ బాధనంతా గుండెల్లోనే దాచుకుంటాడు. ఈ క్రమంలోనే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యపాలవుతాడు. అందుకే పక్షవాతం, హెమరేజ్, గుండెపోటు లాంటి వ్యాధులు ఎక్కువగా పురుషులకే వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కుటుంబం కోసం అమ్మ వత్తిలా మండి వెలిగిస్తే, నాన్న మైనంలా కరుగుతూ చివరిబొట్టు వరకు ఆ ఒత్తికి రక్షణగా నిలుస్తాడు.
ఇలాంటి వారు కూడా....
బాధ్యతలను విస్మరించి దుర్వ్యసనాలతో కుటుంబ సభ్యులకు నరకం చూపే తండ్రులు కూడా లేకపోలేదు. మన జిల్లాలో కూడా గత ఆరు నెలల్లో అలాంటి నాలుగు సంఘటనలు జరిగాయి. కానీ, కుటుంబ సభ్యుల సుఖ సంతోషాల కోసం సర్వాన్ని త్యాగం చేసే తండ్రులే ఎక్కువ. వీరిలో చాలామంది ఒక దశలో తన సతీమణికి తండ్రిగా కూడా ఆసరాగా నిలుస్తున్నారు. తన కుటుంబ సభ్యుల ఉన్నతి కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడడం లేదు.
రోజురోజుకు నైతిక విలువలు పతనమవుతున్న ప్రస్తుత సమాజంలో తమ ఉన్నతి కోసం జీవితాన్ని అర్పించిన తల్లిదండ్రులను తమకోసం ఏమీ చేయలేదని నిందించి వయసుడిగిన దశలో వారిని ఇళ్ల నుంచి బయటికి గెంటేస్తున్న బిడ్డలు కూడా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు కూడా జిల్లాలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. పని మనిషిగా పనికొస్తుందని తల్లిని మాత్రం ఇంటిలో ఉండనిచ్చి తండ్రులను వీధులపాలు చేస్తున్న సంఘటనలూ లేకపోలేదు. జీవితాన్ని కరిగించి ఆస్తులుగా అందిస్తే వాటాల్లో తేడాలొచ్చాయని తండ్రులను మట్టుబెట్టిన సంఘటనలను కూడా మనం చూస్తున్నాం.
కొడుకు పుడితే పున్నామనరకం నుంచి తప్పిస్తాడని ఆనందపడిన తండ్రికి బ్రతికుండగానే నరకం చూపిన పుత్ర రత్నాలు కూడా ఉన్నారు. దిగజారుతున్న విలువలకు ప్రతీకలుగా వెలుస్తున్న వృద్ధాశ్రమాలలో వృద్ధ మహిళల కంటే వృద్ధులైన పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రత్యేకంగా తండ్రుల దినోత్సవాలను నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తమ సమాజ నిర్మాణంలో తండ్రికి గల కీలకమైన స్థానాన్ని తెలియజెప్పి, తండ్రి ఔన్నత్యం, విలువ పట్ల అవగాహన పెంచవలసిన ఆవశ్యకత ఉంది.
డేంజర్
కడప-పులివెందుల ప్రధాన రహదారిలోని వెల్లటూరు సత్యసాయి హైస్కూల్ సమీపంలోని రోడ్డుపై విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. నాలుగు వరుసల రహదారి విస్తరణ చేసే క్రమంలో విద్యుత్ స్తంభం రహదారికి అడ్డంగా ఉండిపోయింది. దానిని తొలగించి దాని స్థానంలో కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితం కాంట్రాక్టర్లు ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించారు. అయినా ఫలితం లేదు. ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులెవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
- పెండ్లిమర్రి
రథోత్సవం..అంగరంగ వైభవం
పెనగలూరు వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6గంటలకు వేణుగోపాలస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ చేసిన గోవింద నామస్మరణలతో పెనగలూరు వీధులు మారుమోగాయి. ప్రతి ఒక్కరూ కాయకర్పూరం సమర్పించి తమ మొక్కులను సమర్పించుకున్నారు. రథాన్ని పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు.
- పెనగలూరు
కమనీయం.. సత్యదేవుని కల్యాణం
కడప కల్చరల్: కడప నగరం గడ్డిబజారులోగల శ్రీ లక్ష్మి సత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం, మూలమూర్తులకు తిరుమంజనం, అనంతరం సుదర్శన హోమం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి వివాహ క్రతువును నిర్వహించారు.
ఆలయ అర్చకులు, వేద పండితులు రాజేష్ బట్టర్, విజయ్‌బట్టర్‌లు స్వామి పక్షాన అమ్మవారికి మహా మంగళసూత్రాన్ని అలంకరించారు. తలంబ్రాల కార్యక్రమాన్ని భక్తులతో కలిసి ఉత్సాహభరితంగా నిర్వహించారు.
హాజరైన ఎమ్మెల్యేలు
ఈ సందర్భంగా జరిగిన సుదర్శన హోమానికి కమలాపురం, కడప నియోజకవర్గాల శాసనసభ్యులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌బి అంజాద్‌బాషలు హాజరయ్యారు. హోమం, పూర్ణాహుతిలో వారు పాల్గొని హోమ ద్రవ్యాలను సమర్పించారు. అనంతరం ఆలయ మూల మూర్తులకు, ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ చల్లా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.