హామీలు నెరవేర్చకపోతే దిగిపో
ర్యాలీ, ధర్నా నిర్వహించిన మహిళలు
జమ్మలమడుగు రూరల్:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు దిగిపోవాలని మహిళా సంఘాలు నినదించాయి. స్థానిక మండల సమాఖ్య కార్యాలయం నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయడంలో తాత్సారం చేయడం సరైందికాదని పేర్కొన్నాయి. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదు ట నిర్వహించిన ధర్నాలో మహిళలు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోనికి వచ్చి వంద రోజులు పూర్తయినా, ఇంత వరకు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదన్నారు. నాడు ఎటువంటి నిబంధనలు లేకుండ మహిళలు తీసుకున్న రుణాలన్నింటిని మాఫీ చేస్తామన్న చంద్రబాబు నేడు కేవలం పదివేలు మాత్రమే మాఫీ చేస్తామని చెప్పడం ‘ఏరుదాటాక తెప్ప తగులబెట్టడం’ సామెతలా ఉందన్నారు. సీఐటీయూ కార్యదర్శి లక్ష్మీనారాయ ణ, సీపీఎం మండలశాఖ కార్యదర్శి శివనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు రుణాలు చెల్లింవద్దని, తాము అధికారంలోనికి రాగానే మొత్తం మాఫీ చేస్తామని చెప్పారని పేర్కొన్నారు. దీంతో సంఘాలు రుణాలు చెల్లించలేదన్నారు. అయితే రుణాలు చెల్లించాలని లేకుంటే ఇళ్లకు తాళాలు వేస్తామని బ్యాంక్ అధికారులు హెచ్చరిస్తున్నారన్నారు. అనంతరం ఆర్డీఓ వినాయకంకు వారు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఐకేపీ మహిళా సభ్యులు పాల్గొన్నారు.