హాల్ టికెట్.. అందనంటోంది! | hall ticket | Sakshi
Sakshi News home page

హాల్ టికెట్.. అందనంటోంది!

Published Sat, May 2 2015 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

hall ticket

ఇతని పేరు టి.బాలగుర్రప్ప. కడపలో నివాసముంటున్నాడు. ఎస్‌జీటీ పోస్టు కోసం కడప, చిత్తూరు జిల్లాల్లో దరఖాస్తు చేశాడు. అధికారులు సర్టిఫికెట్లన్నీ చూసిన తర్వాతనే దరఖాస్తు స్వీకరించారు. అయితే కడపలో పరీక్ష రాసేందుకు హాల్ టికెట్ వచ్చింది. చిత్తూరులో మాత్రం ఫోటో రిజెక్ట్..అప్‌లోడ్ చేయమని సిస్టమ్ అడుగుతోంది.  
 
 కడప నబీకోటలో నివాసముంటున్న కె.నాగేంద్రప్రసాద్‌ది విచిత్ర పరిస్థితి. ఇతను డీఎస్సీకి సంబంధించి బయాలజీ, ఇంగ్లిష్ పోస్టులకు దరఖాస్తు చేశాడు. పరీక్ష ఈనెల 10, 11 తేదీల్లో ఉండగా.. ఇప్పటివరకు బయాలజీకి మాత్రం హాల్ టికెట్ వచ్చింది. ఇంగ్లిష్‌కు సంబంధించి హాల్ టికెట్ రావడం లేదు. రిజెక్ట్‌డ్ డీఈఓ అంటూ వస్తోంది.  అధికారులు సమస్యను పరిష్కరించాలని ఇతను కోరుతున్నాడు.
 
 సాక్షి, కడప: డీఎస్సీ..బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన ప్రతి నిరుద్యోగి కల ఇది. దీనిని సాధించేందుకు అహోరాత్రులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అయితే వీరి ఆశలపై ఆన్‌లైన్ సమస్యలు నీళ్లు చల్లుతున్నాయి. వీటి డౌన్‌లోడ్ కోసం వెళితే రిజెక్ట్ అని చూపుతుండడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ అధికారుల వద్దకు వెళితే వారు తమకేమీ తెలియదని, అదృష్టముంటే వస్తాయని వ్యగ్యంగా మాట్లాడుతున్నారు. త్వరలో డీఎస్సీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆన్‌లైన్ సమస్యలో..మరెదో కారణమో తెలీదు డీఎస్సీ హాల్ టికెట్ల జారీ వ్యవహారం అంతా అయోమయంగా మారింది.  
 
 జిల్లాలో డీఎస్సీకి సంబంధించి 21,826 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది నిరుద్యోగులు జిల్లాతోపాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంత, కర్నూలు జిల్లాల్లో డీఎస్సీకి దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 25 నుంచి ఆన్‌లైన్‌లో డీఎస్సీకి సంబంధించి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా మందికి ఆన్‌లైన్‌లో హాల్ టికెట్ల వివరాలు కనిపించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. రెండు జిల్లాల్లో దరఖాస్తు చేసిన కొంతమంది అభ్యర్థులకు కేవలం ఒకచోట పరీక్ష రాయడానికి మాత్రమే హాల్‌టికె ట్ వస్తోంది. మరో జిల్లాలో పరీక్ష రాయడానికి రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీకి ఫీజుతోపాటు ఖచ్చితంగా సర్టిఫికెట్లను అందజేసినా రాకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.  ఇంకొందరికి డీఈవో రిజెక్ట్ అని...మరికొందరికి ఫోటో అప్‌లోడ్ చేయాలని.. ఆన్‌లైన్‌లో సూచిస్తోంది. దీంతో అభ్యర్థులు బిత్తరపాటుకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరుగుతోందని...అది సవరిస్తే అందరికీ హాల్ టికెట్లు అందుతాయని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ విషయమై విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే.. ‘‘అదృష్టముంటే వస్తాయి పోండి...మమ్మలేమి చేయమంటారు.’’ అంటూ సమాధానం రావడంతో నిరుద్యోగులు అవాక్కవుతున్నారు. హాల్ టికెట్ల మంజూరు కోసం డీఈఓ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని  పలువురు సూచిస్తున్నారు.
 
 న్యాయం చేస్తాం: బండ్లపల్లె ప్రతాప్ రెడ్డి, డీఈఓ
 హాల్ టికెట్ రాని నిరుద్యోగులు అన్ని సర్టిఫికెట్లు తీసుకువస్తే ఉన్నతాధికారులకు పంపుతాం. రెండుసార్లు దరఖాస్తు చేసినా హార్డ్‌కాపీలో ఒకటే ఉండడం వల్ల కూడా అలా జరిగి ఉండవచ్చు.. సర్టిఫికెట్లు చూపిస్తే పరిశీలించి న్యాయం చేస్తాం. రెండు జిల్లాల్లో దరఖాస్తు చేసినా ఏదైనా తేడాలుంటే హాల్ టికెట్ ఒక జిల్లాకే వచ్చి ఉండవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement