హ్యాపీ డే...
తాడేపల్లి రూరల్: ఆదివారం.. ఆ కుటుంబానికి హ్యాపీ డే. బతుకుదెరువు కోసం ఇరాక్ వెళ్లి.. అక్కడి అంతర్యుద్ధం కారణంగా పడరాని పాట్లు పడిన కుటుంబ యజమాని క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవటమే ఇందుకు కారణం. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన ఎస్‌కె బాజీఖాన్ ఇంట్లో ఆదివారం ఆనందోత్సాహాలు వెల్లివిరిశారుు. బాజీఖాన్, బ్రహ్మానందపురానికి చెందిన కోడూరు లక్ష్మణ్‌లు నాలుగు నెలల క్రితం ఇరాక్ దేశంలోని కోఫిల్ పట్టణానికి చేరువలో ఉన్న కారవంచి జ్యూస్ ఫ్యాక్టరీలో పని చేయడానికి వెళ్లారు.
అయితే ఇరాక్‌లో అంతర్యుద్ధం ప్రారంభమవటం.. బాజీఖాన్, లక్ష్మణ్‌లు పనిచేస్తున్న ఫ్యాక్టరీకి 40 కిలోమీటర్ల దూరంలో యుద్ధం జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యూరు. తమను ఇండియా రప్పించేందుకు గట్టిగా యత్నించాలని బాజీఖాన్, లక్ష్మణ్‌లు తమ బంధువులు, స్నేహితులను వేడుకోవటంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. చివరికి కేంద్ర ప్రభుత్వ చొరవతో వారిద్దరు స్వదేశానికి చేరుకున్నారు.
ఇరాక్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి విమానంలో బయలుదేరిన బాజీఖాన్, లక్ష్మణ్‌లు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి, అక్కడనుంచి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎరుుర్‌పోర్టుకు చేరుకున్నారు. తన బ్యాగ్ కనిపించకపోవటంతో లక్ష్మణ్ అక్కడే ఉండిపోగా బాజీఖాన్ అష్టకష్టాలు పడి ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు తాడేపల్లి చేరుకున్నారు. ఆయన్ను చూడగానే భార్యాబిడ్డలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఒక్కసారిగా చుట్టుముట్టి రోదించారు. బాజీ తన పిల్లలిద్దరినీ ఎత్తుకుని ముద్దాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అల్లాహ్ దయ వల్ల భార్యాబిడ్డలను కలుసుకోగలిగానని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ తమను కరుణించారని ఆనందం వ్యక్తం చేశారు.
బస్ చార్జీలకు సొమ్ము లేక తంటాలు..
హైదరాబాద్ వరకు తీసుకొచ్చిన అధికారులు కనీసం బస్సు చార్జీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో స్వగ్రామానికి వచ్చేందుకు బాజీఖాన్ నానా తంటాలు పడ్డారు. ఇరాక్ నుంచి తమతోపాటు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మిత్రుల వద్ద సొమ్ము తీసుకుని బస్సులో విజయవాడకు, అక్కడ నుంచి ఆటోలో తాడేపల్లి చేరుకున్నారు.