మున్సిపాలిటీల్లో 4,822 మందిపై వేటు!
హౌసింగ్‌లో 150 మంది తొలగింపు
160 మంది ఆరోగ్య మిత్రలు అవుట్
476 మంది ఆశా వర్కర్ల తొలగింపు
19 నెలల్లో జిల్లాలో ఒక్క నియామకం లేదు
ఒక్కసారిగా రోడ్డునపడ్డ సిబ్బంది
విజయవాడ : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తమను రెగ్యులర్ చేస్తారని, మెరుగైన వేతనాలు కల్పిస్తారని ఆశపడిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ప్రస్తుత ప్రభుత్వం షాకిచ్చింది. అధికారంలోకి రాగానే వరుసగా కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. దీంతో కుటుంబానికి ఆధారంగా ఉన్న ఉద్యోగం కోల్పోయి వేలాదిమంది ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు. గృహనిర్మాణ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 8,400 మంది కార్మికులను తొలగించగా, అందులో జిల్లాకు చెందినవారు 150 మంది ఉన్నారు. వారిలో ఏఈలు 130 మంది ఉండగా, కంప్యూటర్ ఆపరేటర్లు 20 మంది ఉన్నారు. ఆ తరువాత ఐకేపీలో, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగిస్తూ జీవో ఇచ్చారు. ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకం కింద పనిచేస్తున్న 476 మంది ఆశా వర్కర్లను తొలగించారు.
హక్కులు హరించేందుకు దొడ్డిదారిన జీవో...
తాజాగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు గత డిసెంబరు 31న జీవో 279ని దొడ్డిదారిన తీసుకొచ్చారు. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో కలిపి 4,822 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈ జీవో ప్రకారం అర్బన్, స్థానిక సంస్థల్లో (నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో) పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు ఎలాంటి సంబంధం లేకుండా పని నిర్వహణ టెండర్లు పిలవనున్నారు. ఆ పని నిర్వహణకు ఎన్ని నిధులు అవసరమో పొందుపరుస్తూ మాత్రమే టెండర్లు పిలుస్తారు. ఇందులో ఎంతమంది కార్మికులు కావాలనే ప్రస్తావన రాదు. టెండర్‌లో కార్మికుడు అనే పదం ఎక్కడా ఉండదు. దీనివల్ల కార్మికులు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ, పనిగంటలు, ప్రభుత్వ సెలవు దినాలు, సంక్షేమం వంటి సౌకర్యాలన్నీ కోల్పోతారు.
‘ఆశ’ అడియాసే...
క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశావర్కర్లను తొలగిస్తూ కలెక్టర్ బాబు.ఎ గత డిసెంబర్‌లో తీసుకున్న నిర్ణయంతో వందల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు జరగటం లేదని, మాతా శిశు మరణాల రేటు జిల్లాలో పెరిగిందనే కారణం చూపి 476 మందిని ముందస్తు హెచ్చరికలు లేకుండా తొలగించటం అమానవీయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నెలకు రూ.500 నుంచి రూ.1000 గౌరవ వేతనంగా ఇస్తున్నారని, అయినా పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటున్నారని పేర్కొంటున్నారు. తొలగించినవారిని విధుల్లోకి తీసుకోవాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పారితోషికాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
160 మంది ఆరోగ్య మిత్రల తొలగింపు
జీవో నంబరు 28 ద్వారా జిల్లాలోని 160 మంది ఆరోగ్య మిత్రలను కూడా తొలగించారు. వారి స్థానంలో వేరే వారిని తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2007 నుంచి విధుల్లో ఉన్న వీరిని ఒక్కసారిగా తొలగించటంతో ఇప్పటికిప్పుడు వేరే ఉద్యోగాలు వెతుక్కోవాలంటే ఎలాగని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి జీతంమీదనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు కూడా ఉండటంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. కాంట్రాక్టు సిబ్బందిని వరుసగా తొలగిస్తున్న ప్రభుత్వం గత 19 నెలల పాలనా కాలంలో జిల్లాలో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవటం గమనార్హం.
ఈ కుటుంబాలకు దిక్కెవరు!
Published Fri, Jan 22 2016 2:12 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement