ఆరోగ్యశాఖ సిబ్బందిపై వేటు! | Health Department personnel suspended | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖ సిబ్బందిపై వేటు!

Published Tue, Dec 2 2014 3:07 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఆరోగ్యశాఖ సిబ్బందిపై వేటు! - Sakshi

ఆరోగ్యశాఖ సిబ్బందిపై వేటు!

 సాక్షి, విశాఖపట్నం: చింతపల్లి ట్రెజరీలో వెలుగుచూసిన కుంభకోణానికి వైద్యఆరోగ్యశాఖలో బాధ్యులైన వారిపై చర్యలకు ఆశాఖ ఉన్నతాధికారులు రంగంసిద్ధం చేస్తున్నారు. ఆశాఖ కమిషనర్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలమేరకు ఆ శాఖకు చెందిన చీఫ్‌అకౌంట్స్‌ఆఫీసర్  మూడు రోజులు  జిల్లాలో మకాం వేసి అసలు ఏం జరిగింది, ఈ భారీ కుంభ కోణంలో ఎవరెవరిపాత్ర ఉంది? ఏఏ స్థాయి అధికారుల భాగస్వామ్యంతో ఈ వ్యవహారం సాగింది అనే కోణాలపై అంతర్గత విచారణ నిర్వహించారు. ఇందులో అప్పటి రాష్ర్టస్థాయి ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉండి ఉండవచ్చుననే అభిప్రాయానికి విచారణాధికారి వచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ స్థాయి నుంచి చింతపల్లిస్థాయి వరకు చాలా మంది అధికారులు,సిబ్బంది పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 20 మంది వరకు ఈ కుంభకోణం పాత్ర ఉన్నట్టగా నిర్ధారణకు వచ్చినట్టు తెలియవచ్చింది.
 
 అప్పటి డీఎంఅండ్‌హెచ్‌వో పాత్ర ఈ కుంభకోణంలో కీలకమని భావిస్తున్నారు. ఈ అవినీతికి 2012లోనే ఆజ్యం పడినట్టుగా గుర్తించారు. అప్పట్లో నియామకాలు, బదిలీలు, పదోన్నతులతో పాటు జీతభత్యాల డ్రాయింగ్ , డిస్బర్స్ మెంట్స్‌కు సంబంధించి ఏజెన్సీ వైద్య ఆరోగ్యశాఖలో కీలక అధికారికి దఖలు పరుస్తూ అప్పటి ప్రభుత్వం జీవో ఎంఎస్-420ను జారీ చేసింది. ఈ జీవోను అడ్డంపెట్టుకునే ఈ అవినీతి, అవకలకు జరిగినట్టుగా విచారణలో గుర్తించారు. 2011-12లో 40మంది సిబ్బంది జీతభత్యాల కోసం రూ.80 లక్షల బడ్జెట్ కేటాయింపులు జరిపితే 2012-13కు వచ్చేసరికి ఏకంగా రూ.2.8కోట్ల మేర కేటాయింపులు జరిగాయి.
 
 ఇక 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం కాస్తా ఏకంగా ఐదు కోట్లకు చేరింది. ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది జీతభత్యాల నిమిత్తం ఇంతపెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరిపితే పైనుంచి కింద వరకు ఏ ఒక్కరూ పసిగట్టకపోవడం చూస్తుంటే అందరి ప్రమేయం ఈ కుంభఖోణంలో ఉన్నట్టుగా అనుమానించాల్సి వస్తున్నదని విచారణాధికారి కామెంట్  చేసినట్టు చెబుతున్నారు. అసలు సిబ్బందే లేకుండా జరిపిన ఈ నకిలీ నియామకాలన్నీ సదరు జీవో ఎంఎస్-420ను ఆధారంగా జరిగినట్టుగా విచారణలో గుర్తించారు. విచారణ నివేదికను వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌కు సమర్పించనున్నట్టుగా చెబుతున్నారు. ఈ నివేదిక ఆధారంగా చేసుకుని అవసరమైన వారిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. వీరిపై శాఖపరంగా సస్పెన్షన్లు విధించడంతో పాటు వారిపై క్రిమిన ల్ కేసులు నమోదుకు  ఆదేశాలు జారీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement