సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్‌గఢ్, దాన్ని ఆనుకుని మధ్య ఒరిస్సా, విదర్భ ప్రాంతంలో భూ ఉపరితలంపై అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది పశ్చిమ దిశగా కదులుతోంది. అల్పపీడనం భూమిపైకి రావడంతో వాయుగుండంగా మారే అవకాశాల్లేవని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. దీన్ని ఆనుకుని 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీంతో కోస్తాంధ్ర, తెలంగాణాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి.
మరోవైపు ఒరిస్సా నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుం చి అతి భారీ వర్షాలు, కోస్తాంధ్రలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
పాలకొండ, కొమరాడల్లో 9 సెం.మీ.
ఆదివారం ఉదయానికి గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలోని పాలకొండ, కొమరాడల్లో గరిష్టంగా 9 సెం.మీ., పార్వతీపురం, జియ్యమ్మవలస, మందసలో 7 సెం.మీ. వర్షపాతం నమోదయింది. తెలంగాణలోని సిర్పూర్‌లో గరిష్టంగా 23 సెం.మీ. వర్షం కురిసింది. మంథని 19, మంచిర్యాల 16, రామగుండం 15, చెన్నూరు, కాళేశ్వరం, అసిఫాబాద్‌లో 13, పేరూరు 12, వెంకటాపురం, భూపాలపల్లిల్లో 11, గోల్కొండ, గోవిందరావుపేటలో 10, లక్సెట్టిపేట 9, పరకాల, ఉట్నూరుల్లో 8, అదిలాబాద్, ధర్మపురి, సారంగపూర్, తాండూరు, ములుగుల్లో 7, ఏటూరునాగారం, మొగుళ్లపల్లిల్లో 6, జూలపల్లి, నల్లబెల్లి, జగిత్యాలల్లో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.
దక్షిణ కోస్తా, తెలంగాణలో భారీ వర్షాలు!
Published Mon, Sep 8 2014 1:46 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement