సాక్షి, మచిలీపట్నం/ న్యూస్‌లైన్, నందిగామ రూరల్ : జిల్లాలో ఈ ఏడాది 1.37 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయగా, పంట చేతికొచ్చే తరుణంలో రోజులతరబడి కురిసిన భారీ వర్షాలు రైతును దెబ్బతీశాయి. తీతకు సిద్ధంగా ఉన్న పత్తి.. పొలాల్లోనే పూర్తిగా తడిసిపోయింది. మొక్కలపైనే పత్తి మొలకలు వచ్చేసింది. దీనికితోడు పంట పొలాల్లో తేమ శాతం ఎక్కువ కావడం వల్ల ఉన్న మొక్కలు కూడా నిలువునా ఎండిపోతున్నాయి.
మొక్కలను బతికించుకునేందుకు పలు రకాల మందులను పిచికారీ చేస్తున్నా ప్రయోజనం కనిపించటం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసిన రైతులు దెబ్బతిన్న పత్తి, ఎండుతున్న మొక్కలను చూసి కంటతడి పెడుతున్నారు. నేటికీ కొన్ని గ్రామాల పరిధిలో పత్తి పొలాల్లో వర్షపు నీరు దర్శనమిస్తూనే ఉంది. కొన్ని గ్రామాల పరిధిలో దెబ్బతిన్న పత్తిని ఏంచేయాలో తెలియక రైతులు ఊరికి దూరంగా రోడ్ల వెంబడి పారవేస్తున్నారు.
జిల్లాలో గతేడాది నవంబరు ఐదున సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఈ ఏడాది ఇప్పటివరకు వాటిని ప్రారంభించలేదు. నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, మైలవరం, గంపలగూడెం మార్కెట్ యార్డుల్లో నవంబర్ 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని జిల్లా అధికారులు ప్రకటించారు.
వ్యాపారులదే రాజ్యం...
రైతుల అవసరం వ్యాపారులకు వరంగా మారింది. వర్షం కారణంగా పత్తి దెబ్బతిన్నదనే సాకుతో కొందరు వ్యాపారులు రైతుల వద్ద నుంచి పత్తిని కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. వాస్తవంగా పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.4 వేలు కాగా, రంగు మారిందని, తడిసిందని చెబుతూ వ్యాపారులు తమకు తోచిన ధర చెల్లిస్తున్నారు.
భారీ వర్షాలు రైతును దెబ్బతీశాయి
Published Mon, Nov 11 2013 3:13 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement