జిల్లాలో జోరుగా వర్షం, పంటలకు తీవ్ర నష్టం
Published Sat, Aug 17 2013 3:59 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వివాహం చేసుకునే వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బోర్ల సాగు కింద ముందుగా వేసిన పత్తి, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. కాయ దశలో ఉన్న పత్తి పంట కుళ్లి పోతోంది. ఆకులు మొత్తం రాలి రెండో పంట రావడం కష్టంగా మారింది. మార్కాపురం, అద్దంకిలలో కూడా అధిక వర్షం కురిసింది. దాదాపు 10 వేల హెక్టార్లలో పత్తి పంట, 4వేల హెక్టార్లలో నువ్వు పంట దెబ్బతిందని రైతులు తెలిపారు. దాదాపు రూ.40 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
చీరాల డివిజన్‌లో కొద్దిపాటి వర్షం కురిసింది. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల, గిద్దలూరు, కంభం మండలాల్లో అధిక వర్షం కురిసింది. గిద్దలూరు అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సగిలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని చోళ్లవీడు గ్రామం వద్ద ఆకవీడు వెళ్లే రోడ్డులో నిర్మించిన బ్రిడ్జి పైనుంచి వర్షపు నీరు వేగంగా పారుతోంది. ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కంభం మండలం తురిమెళ్ల, యర్రబాలెం గ్రామాల మధ్య గుండ్లకమ్మ ఉధృతికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. గిద్దలూరులో 77, రాచర్లలో 27.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. యర్రగొండపాలెంలో వర్షం జోరున కురిసింది. అధిక విస్తీర్ణంలో సాగయిన పత్తి పంట బాగా దెబ్బతింది. వాగులు, వంకలు వర్షపు నీటితో కళకళలాడాయి. మార్కాపురంలో వర్షం తీవ్రంగా ఉంది. జనజీవనం స్తంభించింది.
వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పత్తి, సజ్జ, కంది పంటలకు వర్షం జీవం పోసినట్లయింది. చీరాలలో తేలికపాటి వర్షం కురిసింది. సాగులో ఉన్న పత్తి, కంది, నువ్వు పంటలకు వర్షం వరంగా మారింది. అద్దంకిలో వర్షం తీవ్ర రూపం దాల్చింది. మండలంలో 150.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పొలాల గట్లు కోసుకుపోయాయి. కొన్ని భూముల్లో మేటలు వేశాయి. పర్చూరులో భారీ వర్షాలకు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో చుట్టుపక్కల ఉన్న పొలాలు కోసుకుపోయాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఒకమాదిరి వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం పంటలకు జీవం పోయగా, మరి కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
Advertisement
Advertisement