పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. దాంతో పట్టణంలోని పలు వార్డులు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. అలాగే తాడేపల్లి గూడెం గ్రామీణ మండలంలోని పెద్ద తాడేపల్లిలోని చెరువుకు గండి పడింది. దీంతో ఇళ్లలోకి చేరువు నీరు వచ్చి చేరింది. అధికారులు వెంటనే అప్రమత్తమై వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే గూడెం శివారు ప్రాంతంలోని ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది.
ఈ నేపథ్యంలో ఆ కాలువ సమీపంలోని గ్రామాలు బంగారుగూడెం, వీరంపాలెం, పశ్చిమపాలెం, జగన్నాధపురం, నందమూరు, మారెంపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో పాలకొల్లులోని ఫైర్ స్టేషన్, పశువుల ఆస్పత్రి, హౌసింగ్ బోర్డ్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పాలకొల్లు - భీమవరం రహదారిలోని లంకలకోడేరు వద్ద భారీ చింతచెట్టు కుప్పకూలింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.