
ఖరీఫ్ పంటలపై పిడుగు
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ పంట ఆశలన్నీ తుడిచి పెట్టుకు పోయాయి. పంట చేతికొచ్చే దశలో ఎడతెరపి లేని వర్షాలు రైతులను కుదేలు చేశాయి. శుక్రవారం మధ్యాహ్నానికి అధికారుల ప్రాథమిక అంచనాల మేరకు 15 జిల్లాల్లో 10.85 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వచ్చే రెండు మూడు రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటే నష్టం ఇంకా రెండు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉద్యాన శాఖ అధికారుల ప్రాథమిక అంచనాల మేరకు ఇప్పటి వరకూ 80 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఇందులో మిరప, కూరగాయలు, పూల తోటలు అధికంగా ఉన్నాయి. మరో వైపు పలు జిల్లాల్లో చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఇంకా వర్షాలు పడితే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందల చెరువులకు ఏ క్షణానైనా గండ్లు పడవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గండ్లు పడితే పంటలు మరింతగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కర్నూలు, కడప జిల్లాల్లోని కుందూ పరీవాహక ప్రాంతంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి.
రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితి నెలకొని ఉంటే, వ్యవసాయ మంత్రి, ఆ శాఖ కమిషనర్ మాత్రం ఢిల్లీ పయనమయ్యారు. ప్రపంచ వ్యవసాయ సదస్సు గురించి ఢిల్లీలో జాతీయ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశానికి శనివారం వీరు హాజరు కానున్నారు. గురు, శుక్ర వారాల్లో కూడా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రపంచ వ్యవసాయ సదస్సు సన్నాహాలపై వరుస మీటింగుల్లో బిజీగా గడపడం గమనార్హం.
ఇక కూర‘గాయాలు’: హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాలో కూరగాయల పంటలు నీట మునిగాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే అధికారిక అంచనాల మేరకు 6250 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా తదితర జిల్లాలో కూరగాయల సాగు బాగా నష్టపోయింది. మళ్లీ పంట రావాలంటే ఎంత లేదన్నా రెండు నెలలు పైగా నే సమయం పడుతుంది. ఇప్పటికే చుక్కలంటుతున్న కూరగాయల ధరలు మరింత పెరిగి సామాన్యుడికి పెనుభారం కానుంది. కార్తీక మాసానికి బంతి పూలకు బాగా గిరాకీ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.