పుట్టలో ఉన్న శివలింగ ఆకారం (ఇన్‌సెట్లో) వెంకటేష్
పెద్దకడబూరు : యాదృచ్ఛికమో, మరేదైనా మతలబు ఉందో తెలియదు కానీ ఆ గ్రామంలో విగ్రహాలు వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. మహత్తుతోనే విగ్రహాలు వెలుగు చూశాయని కొంద రు భావిస్తుండగా, అవి పురాతనమైనవి కాదని మరి కొందరి వాదన. ఏది ఏమైనా పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామంలో అమ్మవారు, శివలింగ విగ్రహాల విషయం హాట్‌టాపిక్‌గా మారింది. గ్రామానికి చెందిన ఉప్పరి తిక్కయ్య, రామలింగమ్మ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు వెంకటేష్‌కు అప్పుడప్పుడు యల్లాగారి తాయమ్మవ్వ పూనకం వస్తుందట. అందులో భాగంగా గత గురువారం వారి పొలం గట్టులోని పుట్టలో శివ పార్వతుల విగ్రహాలు ఉన్నట్లు తెలిపారట.
దీంతో వెంక టేష్ ఆ రోజు సాయంత్రం అమ్మవారి విగ్రహాన్ని పుట్టలో నుంచి తీసి పక్కనే ఉన్న గుడిసెలో పెట్టాడట. శివలింగాన్ని తీయడానికి చేతగాక పుట్టలోనే వదిలేశాడట. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు నాలుగు రోజుల పాటు సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. గ్రామస్తులు గమనించి చెప్పడంతో సోమవారం కొందరు వచ్చి దర్శించుకొని వెళ్లారు. గ్రామానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి విగ్రహాలను చూడడానికి రాగా ఆమెకు కూడా పూనకం వచ్చిందని, వచ్చే ఏకాదశి రోజున శివలింగాన్ని తీయాలని, అది కూడా వెంకటేష్ మాత్రమే తీయాలని సెలవిచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సమాచారం ఆనోటా ఈనోటా పడడంతో మంగళవారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన పెద్దతుంబళం, కామవరం, కోసిగి, నౌలేకల్లు తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో జనాలు వచ్చి విగ్రహాలకు పూజలు చేశా రు. సాయంత్రం ఈ విగ్రహాలను ఆదోని తహసీల్దార్ శ్రీనాథ్, వీఆర్వో శ్రీనివాసులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం కర్నూలుకు తరలించారు.
కొసమెరుపు: పుట్టలో నుంచి తీయడం తనవల్ల కాలే దని వెంకటేష్ చెబుతున్న శివలింగాన్ని అధికారులు సులభంగా తీసుకుని కర్నూలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment