జస్టిస్ బాలయోగికి జ్ఞాపికను బహూకరిస్తున్న ఏసీజే జస్టిస్ ప్రవీణకుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారమే కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ బాలయోగికి వీడ్కోలు పలికేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, రిజిష్ట్రార్ జనరల్, ఇతర రిజిష్ట్రార్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఏసీజే ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు జస్టిస్ బాలయోగి చేసిన సేవలను కొనియాడారు.
అనంతరం బాలయోగి మాట్లాడుతూ ఇన్నేళ్ల తన న్యాయప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో ఉన్నప్పుడు తాను జడ్జి పదవికి రాజీనామా చేశానని, అయితే న్యాయమూర్తుల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఉమ్మడి హైకోర్టు సీజే చేసిన సూచన మేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నానని ఆయన చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర మాట్లాడారు. జస్టిస్ బాలయోగిని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment