ఆధునిక టెక్నాలజీతో వాహనదారులకు బురిడీ
అధికారుల మెరుపు దాడితో బట్టబయలు
మెదక్‌లో పెట్రోల్ బంక్ సీజ్
సెన్సార్ చిప్ స్వాధీనం
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : పెట్రోల్ బంక్‌ల యాజమాన్యాలు హైటెక్ దగాకు పాల్పడుతున్నాయి. తూనికలు, కొలతల అధికారులు గురువారం మెదక్‌లో ఓ పెట్రోల్ బంక్‌పై మెరుపుదాడులు నిర్వహించడంతో విషయం వెలుగుచూసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రానిక్ సెన్సార్ చిప్‌ను కంట్రోల్ రూమ్ నుంచి అనుసంధానం చేస్తూ వాహనదారులను దగా చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో సంచలనం సృష్టించింది. తూనికలు, కొలతల శాఖ మెదక్, నిజామాబాద్ జిల్లాల అసిస్టెంట్ కంట్రోలర్ పీఎస్‌ఆర్‌ఎన్‌టీ.
స్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఆటోనగర్‌లోని రాధాకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్‌లో ప్రత్యేక ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారని, దీనిని రిమోట్ సహాయంతో కంట్రోల్ రూం నుంచే ఆపరేట్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో సుమారు 100 లీటర్ల పెట్రోల్ పోస్తే.. సుమారు 4 నుంచి 5 లీటర్ల వరకు మోసం చేసే అవకాశం ఉందన్నారు. పక్కా సమాచారంతోనే ఈ పెట్రోల్ బంక్‌పై దాడి చేశామని స్వామి తెలిపారు. వినియోగదారులను మోసం చేస్తున్న ఈ పెట్రోల్‌బంక్ పై కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు వివరించారు. ఆయన వెంట తునికలు, కొలతల శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ పి. సత్యనారాయణ, సిబ్బంది అశోక్ రావు తదితరులు ఉన్నారు.
పెట్రోల్ బంక్‌లో హైటెక్ దగా
Published Fri, Jan 31 2014 6:28 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement