అంగట్లో ఆస్పత్రి పోస్టులు | Hospital posts Replacement | Sakshi
Sakshi News home page

అంగట్లో ఆస్పత్రి పోస్టులు

Published Tue, Jan 28 2014 2:47 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Hospital posts Replacement

 అధికారం శాశ్వతం కాదు.. అందులోనూ పదవీకాలం మరెన్నో రోజులు లేదు. అందుకే మంత్రి కోండ్రు అనుయాయులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. భలే మాంచి చౌక బేరమూ అంటూ.. ఆస్పత్రి పోస్టులను అంగట్లో పెట్టేశారు. అభ్యర్థులతో బేరాలు కుదుర్చుకొని మంత్రి సిఫార్సు లేఖలు ఇస్తూ.. వాటిని తీసుకొచ్చే వారికే పోస్టింగ్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రభువుల మనసెరిగిన ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారి సైతం అదే స్థాయిలో జీ హుజూర్ అంటున్నారు. పోస్టులు కట్టబెట్టేయమని రాజాం ఆస్పత్రి అధికారులను ఆదేశిస్తున్నారు. అడ్డగోలుగా సాగుతున్న ఈ తంతు చూసి అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి నుంచి రాజాం వంద పడకల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.ప్రసాదరావుకు అందిన లేఖలోని అంశాలు చూస్తే పోస్టుల భర్తీలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వండాన షణ్ముఖరావు అనే అభ్యర్థికి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఇవ్వాలని వైద్య విద్య శాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్ సిఫార్సు చేసినందున, అతని నియామకానికి వీలుగా అక్కడున్న ఖాళీల వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో స్థానిక అధికారులను సమన్వయాధికారి ఆదేశించారు. 
 
 నిబంధనలను తోసిరాజంటూ...
 కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలన్నా.. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్న విషయాన్ని అటు మంత్రి కోండ్రు, ఇటు ఆస్పత్రుల సమన్వయాధికారి విస్మరించారు. పోస్టుల భర్తీకి మొదట ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో నిర్ణయం తీసుకోవాలి. అనంతరం నోటిఫికేషన్ జారీ చేయాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేయాలి. కానీ ఇవేవీ లేకుండానే ఓ అభ్యర్థి పేరును సూచిస్తూ మంత్రి కోండ్రు సిఫార్సు చేయడం వెనుక ఆయన అనుచరగణం పాత్ర స్పష్టమవుతోంది. రాజాం ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి మంత్రి కోండ్రు మురళీయే అధ్యక్షుడు. కానీ ఆ కమిటీనే పట్టించుకోకుండా నియామకానికి సిఫార్సు చేయడం విడ్డూరం.
 
 ఒత్తిళ్లే... ఒత్తిళ్లు
 తాము సిఫార్సు చేసిన అభ్యర్థికి ఆ పోస్టు కట్టబెట్టాల్సిందేనని అధికారులపై కోండ్రు అనుచరులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ‘మంత్రిగారు ఆదేశించారు... జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అయినా సరే మీరు పోస్టింగ్ ఇవ్వకపోవడమేమిటి?... ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నారా?... లేదా’ అని నిలదీస్తున్నారు. దాంతో అటు నిబంధనలను ఉల్లంఘించలేక... ఇటు మంత్రి అనుయాయుల ఒత్తిడిని తట్టుకోలేక అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఇలా ఈ ఒక్క పోస్టే కాదు...  ఆస్పత్రికి మంజూరైన అన్ని పోస్టుల పందేరానికి  మంత్రి అనుచరగణం పన్నాగం పన్నింది. 
 
 పోస్టులన్నీ మావే!
 రాజాం ఆస్పత్రికి ఇటీవల 35 పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితర పోస్టులు ఉన్నాయి. వాటిపై కోండ్రు అనుచరుల కన్నుపడింది. తమ అభీష్టం మేరకే వాటిని భర్తీ చేయాలని ఇప్పటికే అధికారులకు తేల్చిచెప్పారు. మంత్రి సిఫార్సు లేఖలతో తాము సమర్పించే జాబితాను ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ మేరకు ఆ పోస్టుల కోసం అప్పుడే రేట్లు కూడా నిర్ణయించేసినట్లు తెలుస్తోంది. స్థాయిని బట్టీ ఒక్కో పోస్టుకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు బేరం పెడుతున్నారు. ఈ తతంగాన్ని నిలువరించలేక అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఏదైనా తేడా వస్తే తమ ఉద్యోగాల మీదకు వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. అదండీ సంగతి! మంత్రిగారి అనుచరులా!...మజాకా! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement