Hospital posts
-
ఏపీ వైద్యారోగ్య శాఖ: నియామకాల్లో నవశకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రులను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తూ కొత్త కళను తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్య శాఖలో వేలాది పోస్టులు భర్తీ చేస్తూ వాటికి జవసత్వాలను అందిస్తోంది. మానవ వనరుల లేమితో అల్లాడుతున్న ప్రభుత్వాస్పత్రులకు కొత్త రూపును తీసుకొస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే దాదాపు 14వేల పోస్టులను భర్తీ చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 14,391 పోస్టులను ఏకకాలంలో భర్తీ చేసేందుకు సంకల్పించింది. రెండ్రోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఈ పోస్టులన్నిటినీ నవంబర్ చివరి నాటికి భర్తీ చేసేందుకు ఆరోగ్య శాఖ కార్యాచరణ చేపట్టింది. గత నాలుగు దశాబ్దాల్లో వైద్య ఆరోగ్యశాఖలో ఇంతపెద్ద స్థాయిలో పోస్టులు భర్తీ అయిన సందర్భాలు లేవు. మరీ ముఖ్యంగా 2014–19 మధ్య కాలంలో కనీసం ఒక నర్సు పోస్టు భర్తీ కావాలన్నా అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. పైగా ఆయుష్‌లో 800 మంది ఉద్యోగులను తొలగించిన దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ ఖాళీలతో సేవలకు నోళ్లు తెరుచుకుని ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త కళ వచ్చింది. కొత్త భర్తీలతో భారీగా మానవ వనరులు పెరగనున్నాయి. ఇక అన్ని చోట్లా పరిపూర్ణ సేవలు గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో చాలా చోట్ల ఒకే డాక్టరు ఉండేవారు. ఆ డాక్టరు సెలవు పెడితే ఆరోజు రోగులకు సేవలు ఉండవు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఇద్దరు వైద్యులు. 104లో మరొకరు. ఎప్పుడైనా, ఏ ఆస్పత్రికి వెళ్లినా డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఇవ్వబోతున్న నోటిఫికేషన్లో కేవలం డాక్టర్లే 2,863 మంది ఉన్నారు. ఇందులో బోధనాస్పత్రులకే 650 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు వస్తున్నారు. ఇప్పటికే 695 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోధనాస్పత్రుల్లో నియామకం పొందారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లోనూ 1,500 మంది వరకూ డాక్టర్లు నియమితులయ్యారు. కొత్త పోస్టుల భర్తీతో అన్ని ఆస్పత్రుల్లో పరిపూర్ణంగా సేవలు అందే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు రూ. 9.48 కోట్లు వ్యయం వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ. 2,753.79 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా కొత్తగా భర్తీ చేసే 14,391 పోస్టులకు ఏడాదికి వేతనాల రూపంలో రూ. 707.52 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అంటే మొత్తం ఏడాదికి రూ. 3,461.31 కోట్లు వ్యయం అవుతుంది. 365 రోజులకు గానూ రోజుకు రూ. 9.48 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. 1 నుంచి నోటిఫికేషన్ల పండగ తాజాగా ఇచ్చిన 14,391 పోస్టులకు నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ల పండుగ మొదలవబోతోంది. అక్టోబర్ 1 నుంచి జిల్లాల వారీగా నియమించే పోస్టులకు జిల్లాల్లోనూ, రాష్ట్రస్థాయి పోస్టులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలోనూ నోటిఫికేషన్లు ఇస్తారు. ఆన్లైన్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పకుండా పాటించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ప్రతి పోస్టుకు సంబంధించిన మెరిట్ జాబితాను ఆన్లైన్లో నమోదు చేస్తారు. పోస్టుల భర్తీతో నిరుద్యోగుల్లో ఆనందం మొదలైంది. నవంబర్ చివరికి అన్ని పోస్టులూ భర్తీ కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు ఈ నెల 24నే ముఖ్యమంత్రికి పంపించాం. అక్టోబర్ 1వ తేదీ నుంచి నోటిఫికేషన్లు ఇస్తాం. నవంబర్ 15వ తేదీలోగా నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏదేమైనా నవంబర్ చివరి నాటికి నోటిఫై చేసిన అన్ని పోస్టులనూ భర్తీ చేస్తున్నాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
వైద్యారోగ్య శాఖలో భారీ నియామకాలు.. 14,200 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు దాదాపు 14,200కు పైగా పోస్టుల భర్తీకి అధికారులు చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అక్టోబరు 1 నుంచి పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది నియామకం, కోవిడ్–19 నివారణ, వ్యాక్సినేషన్‌పై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది కొరత లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు వివిధ స్థాయిల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బంది, జాతీయ స్థాయిలో ప్రమాణాలు, ప్రస్తుత అవసరాలు తదితర వివరాలపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. డాక్టర్ సెలవులో వెళ్తే మరో డాక్టర్ విధులు నిర్వహించాలి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సరిపడా సిబ్బందితో సమర్థవంతంగా నడపాలి. ఒక డాక్టరు సెలవులో వెళ్తే.. ఆ స్థానంలో మరో డాక్టరు విధులు నిర్వహించేలా వ్యవస్థ ఉండాలి. ఈ మేరకు తగిన సంఖ్యలో వైద్యులను నియమించాలి. డాక్టరు సెలవు పెడితే.. రోగులకు వైద్యం అందని పరిస్థితి కానీ, తోటి డాక్టర్లపై భారం పడే పరిస్థితి కానీ ఉండకూడదు. కొత్తగా నిర్మిస్తున్న బోధనాస్పత్రుల పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు నిర్వహించాలి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ఇదే సమయంలో సరిపడా సిబ్బంది లేని కారణంగా రోగులకు మంచి సేవలు అందని పరిస్థితి ఇకపై ఉంటానికి వీల్లేదు. మూడు జిల్లాల్లో వ్యాక్సినేషన్‌పై దృష్టి ►తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ఇందుకోసం ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలి. ►రాత్రి పూట కర్ఫ్యూ యధావిధిగా అమలు చేయాలి. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అంక్షలు కొనసాగుతాయి. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియే కోవిడ్ సమస్యకు పరిష్కారం. అందువల్ల దీన్ని వేగవంతం చేయాలి. ►ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ఇలా.. ►ఏపీలో యాక్టివ్ కేసులు : 13,749 ►ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు : 2,787 ►కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 562 ►రికవరీ రేటు శాతం : 98.60 ►పాజిటివిటీ రేటు శాతం : 2.12 ►3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు : 10 ► 3 నుంచి 5 శాతం పాజిటివిటీ ఉన్న జిల్లా : 2 ►5% కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న జిల్లా : 1 ►రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 10,921 ►నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్స్ శాతం : 91.33 ►ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్స్ శాతం : 72.64 థర్డ్ వేవ్ పై సన్నద్ధత ►అందుబాటులో ఉన్న డీ టైప్ సిలెండర్లు : 27,311 ►అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు : 20,964 ►ఇంకా అందుబాటులోకి రావాల్సినవి : 2,493 ►ఆక్సిజన్ పైప్‌లైన్ పనులు పూర్తయిన ఆస్పత్రులు : 128 ►ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు : 143 ►అక్టోబర్ 10 నాటికి మొత్తం అందుబాటులోకి.. వ్యాక్సినేషన్ ►ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య : 2,61,56,928 ►సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,34,96,579 ►రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు : 1,26,60,349 ►వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించిన మొత్తం డోసులు : 3,88,17,277 -
అంగట్లో ఆస్పత్రి పోస్టులు
అధికారం శాశ్వతం కాదు.. అందులోనూ పదవీకాలం మరెన్నో రోజులు లేదు. అందుకే మంత్రి కోండ్రు అనుయాయులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. భలే మాంచి చౌక బేరమూ అంటూ.. ఆస్పత్రి పోస్టులను అంగట్లో పెట్టేశారు. అభ్యర్థులతో బేరాలు కుదుర్చుకొని మంత్రి సిఫార్సు లేఖలు ఇస్తూ.. వాటిని తీసుకొచ్చే వారికే పోస్టింగ్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నారు. ప్రభువుల మనసెరిగిన ఆ శాఖ జిల్లా ఉన్నతాధికారి సైతం అదే స్థాయిలో జీ హుజూర్ అంటున్నారు. పోస్టులు కట్టబెట్టేయమని రాజాం ఆస్పత్రి అధికారులను ఆదేశిస్తున్నారు. అడ్డగోలుగా సాగుతున్న ఈ తంతు చూసి అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి నుంచి రాజాం వంద పడకల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.ప్రసాదరావుకు అందిన లేఖలోని అంశాలు చూస్తే పోస్టుల భర్తీలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారం ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వండాన షణ్ముఖరావు అనే అభ్యర్థికి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఇవ్వాలని వైద్య విద్య శాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్ సిఫార్సు చేసినందున, అతని నియామకానికి వీలుగా అక్కడున్న ఖాళీల వివరాలు ఇవ్వాలని ఆ లేఖలో స్థానిక అధికారులను సమన్వయాధికారి ఆదేశించారు. నిబంధనలను తోసిరాజంటూ... కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలన్నా.. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్న విషయాన్ని అటు మంత్రి కోండ్రు, ఇటు ఆస్పత్రుల సమన్వయాధికారి విస్మరించారు. పోస్టుల భర్తీకి మొదట ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో నిర్ణయం తీసుకోవాలి. అనంతరం నోటిఫికేషన్ జారీ చేయాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేయాలి. కానీ ఇవేవీ లేకుండానే ఓ అభ్యర్థి పేరును సూచిస్తూ మంత్రి కోండ్రు సిఫార్సు చేయడం వెనుక ఆయన అనుచరగణం పాత్ర స్పష్టమవుతోంది. రాజాం ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి మంత్రి కోండ్రు మురళీయే అధ్యక్షుడు. కానీ ఆ కమిటీనే పట్టించుకోకుండా నియామకానికి సిఫార్సు చేయడం విడ్డూరం. ఒత్తిళ్లే... ఒత్తిళ్లు తాము సిఫార్సు చేసిన అభ్యర్థికి ఆ పోస్టు కట్టబెట్టాల్సిందేనని అధికారులపై కోండ్రు అనుచరులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ‘మంత్రిగారు ఆదేశించారు... జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అయినా సరే మీరు పోస్టింగ్ ఇవ్వకపోవడమేమిటి?... ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నారా?... లేదా’ అని నిలదీస్తున్నారు. దాంతో అటు నిబంధనలను ఉల్లంఘించలేక... ఇటు మంత్రి అనుయాయుల ఒత్తిడిని తట్టుకోలేక అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఇలా ఈ ఒక్క పోస్టే కాదు... ఆస్పత్రికి మంజూరైన అన్ని పోస్టుల పందేరానికి మంత్రి అనుచరగణం పన్నాగం పన్నింది. పోస్టులన్నీ మావే! రాజాం ఆస్పత్రికి ఇటీవల 35 పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితర పోస్టులు ఉన్నాయి. వాటిపై కోండ్రు అనుచరుల కన్నుపడింది. తమ అభీష్టం మేరకే వాటిని భర్తీ చేయాలని ఇప్పటికే అధికారులకు తేల్చిచెప్పారు. మంత్రి సిఫార్సు లేఖలతో తాము సమర్పించే జాబితాను ఆమోదించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ మేరకు ఆ పోస్టుల కోసం అప్పుడే రేట్లు కూడా నిర్ణయించేసినట్లు తెలుస్తోంది. స్థాయిని బట్టీ ఒక్కో పోస్టుకు రూ.25వేల నుంచి రూ.50వేల వరకు బేరం పెడుతున్నారు. ఈ తతంగాన్ని నిలువరించలేక అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఏదైనా తేడా వస్తే తమ ఉద్యోగాల మీదకు వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. అదండీ సంగతి! మంత్రిగారి అనుచరులా!...మజాకా!