ఏపీ వైద్యారోగ్య శాఖ: నియామకాల్లో నవశకం | AP Govt Green Signal For Recruitment Of 14391 Hospital Posts | Sakshi
Sakshi News home page

ఏపీ వైద్యారోగ్య శాఖ: నియామకాల్లో నవశకం

Published Sun, Sep 26 2021 4:43 AM | Last Updated on Sun, Sep 26 2021 5:31 AM

AP Govt Green Signal For Recruitment Of 14391 Hospital Posts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రులను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తూ కొత్త కళను తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్య శాఖలో వేలాది పోస్టులు భర్తీ చేస్తూ వాటికి జవసత్వాలను అందిస్తోంది. మానవ వనరుల లేమితో అల్లాడుతున్న ప్రభుత్వాస్పత్రులకు కొత్త రూపును తీసుకొస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే దాదాపు 14వేల పోస్టులను భర్తీ చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది. వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 14,391 పోస్టులను ఏకకాలంలో భర్తీ చేసేందుకు సంకల్పించింది.

రెండ్రోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఈ పోస్టులన్నిటినీ నవంబర్‌ చివరి నాటికి భర్తీ చేసేందుకు ఆరోగ్య శాఖ కార్యాచరణ చేపట్టింది. గత నాలుగు దశాబ్దాల్లో వైద్య ఆరోగ్యశాఖలో ఇంతపెద్ద స్థాయిలో పోస్టులు భర్తీ అయిన సందర్భాలు లేవు. మరీ ముఖ్యంగా 2014–19 మధ్య కాలంలో కనీసం ఒక నర్సు పోస్టు భర్తీ కావాలన్నా అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. పైగా ఆయుష్‌లో 800 మంది ఉద్యోగులను తొలగించిన దుస్థితి. ప్రభుత్వ ఆస్పత్రులన్నీ ఖాళీలతో సేవలకు నోళ్లు తెరుచుకుని ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త కళ వచ్చింది. కొత్త భర్తీలతో భారీగా మానవ వనరులు పెరగనున్నాయి.

ఇక అన్ని చోట్లా పరిపూర్ణ సేవలు
గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో చాలా చోట్ల ఒకే డాక్టరు ఉండేవారు. ఆ డాక్టరు సెలవు పెడితే ఆరోజు రోగులకు సేవలు ఉండవు. సీఎం జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ఇద్దరు వైద్యులు. 104లో మరొకరు. ఎప్పుడైనా, ఏ ఆస్పత్రికి వెళ్లినా డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కొత్తగా ఇవ్వబోతున్న నోటిఫికేషన్‌లో కేవలం డాక్టర్లే 2,863 మంది ఉన్నారు. ఇందులో బోధనాస్పత్రులకే 650 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు వస్తున్నారు. ఇప్పటికే 695 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోధనాస్పత్రుల్లో నియామకం పొందారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లోనూ 1,500 మంది వరకూ డాక్టర్లు నియమితులయ్యారు. కొత్త పోస్టుల భర్తీతో అన్ని ఆస్పత్రుల్లో పరిపూర్ణంగా సేవలు అందే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

రోజుకు రూ. 9.48 కోట్లు వ్యయం 
వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ. 2,753.79 కోట్లు ఖర్చు చేస్తోంది. తాజాగా కొత్తగా భర్తీ చేసే 14,391 పోస్టులకు ఏడాదికి వేతనాల రూపంలో రూ. 707.52 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అంటే మొత్తం ఏడాదికి రూ. 3,461.31 కోట్లు వ్యయం అవుతుంది. 365 రోజులకు గానూ రోజుకు రూ. 9.48 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.

1 నుంచి నోటిఫికేషన్ల పండగ 
తాజాగా ఇచ్చిన 14,391 పోస్టులకు నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ల పండుగ మొదలవబోతోంది. అక్టోబర్‌ 1 నుంచి జిల్లాల వారీగా నియమించే పోస్టులకు జిల్లాల్లోనూ, రాష్ట్రస్థాయి పోస్టులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ పరిధిలోనూ నోటిఫికేషన్లు ఇస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ జరుగుతుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తప్పకుండా పాటించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ప్రతి పోస్టుకు సంబంధించిన మెరిట్‌ జాబితాను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పోస్టుల భర్తీతో నిరుద్యోగుల్లో ఆనందం మొదలైంది.

నవంబర్‌ చివరికి అన్ని పోస్టులూ భర్తీ 
కొత్త పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు ఈ నెల 24నే ముఖ్యమంత్రికి పంపించాం. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి నోటిఫికేషన్లు ఇస్తాం. నవంబర్‌ 15వ తేదీలోగా నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏదేమైనా నవంబర్‌ చివరి నాటికి నోటిఫై చేసిన అన్ని పోస్టులనూ భర్తీ చేస్తున్నాం.
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement