సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మండల పరిధిలోని బుస్సాపూర్‌లో శనివారం తెల్లవారుజామున ఓ ఇల్లు దగ్ధమైంది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. లేకుంటే ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి ఇరుగుపొరుగు ఇళ్లు కూడా ధ్వంసమై పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వల్లపురెడ్డి కిష్టారెడ్డి రిటైర్డ్ టీచర్. పిల్లలకు పెళ్లి అయి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో కిష్టారెడ్డి దంపతులు గ్రామంలో నివాసముంటున్నారు.
అయితే కిష్టారెడ్డికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఇంటికి తాళం వేసి చికిత్స నిమిత్తం శుక్రవారం సిద్దిపేటకు భార్యతో కలిసి వెళ్లారు. డాక్టర్‌కు చూపించుకుని ఇంటికి బయలుదేరారు. అయితే మధ్యలో ఓ బంధువు ఆహ్వానం మేరకు వారి ఇంట్లోనే ఆ రాత్రి బస చేశారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం కిష్టారెడ్డి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పం దించకుండా ఉంటే ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి పెను ప్రమాదం సంభవించేదని గ్రామస్తులు తెలిపారు. ఇంతలో విషయాన్ని తెలుసుకున్న కిష్టారెడ్డి గ్రా మానికి చేరుకున్నారు. వంట రూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 1.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
షార్‌ట సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
Published Sun, Dec 1 2013 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement