
ఇలాగైతే ఎలా?
అనంతపురం అగ్రికల్చర్ : నేతల మద్య నీటి జగడాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేసి తమ ప్రాంతాలకు నీటిని తీసుకుపోవడానికి యత్నాలు చేస్తున్నారు. అయితే జిల్లా అవసరాలకు సరిపడా నీటిని తీసుకురావడం మానేసి జిల్లాకు వచ్చిన వాటిలో ముందు తమకంటే తమకంటూ పోటీ పడుతున్నారు. పీఏబీఆర్ కుడికాల్వ కింద ఉన్న 49 చెరువులు, చాగల్లు రిజర్వాయర్‌ను నింపాలంటే దాదాపు 9 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 2.1 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. అయినప్పటికీ సోమవారం నుంచి పీఏబీఆర్ కుడి కాల్వకు నీటిని విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.
ఈ నేపథ్యంలో చివరి చెరువులు నీటితో నింపడం సాధ్యమేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఏబీఆర్ కుడికాల్వ ద్వారా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 49 చెరువులను నింపడానికి సోమవారం నుంచి నీటి విడుదల చేస్తున్నారు. 1.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ చెరువులను పూర్తిగా నింపాలంటే ప్రవాహ నష్టాలు కలుపుకుంటే దాదాపు 3.5 టీఎంసీలు అవసరం ఏర్పడుతాయని హెచ్చెల్సీ అధికారులు భావిస్తున్నారు. అయితే ముందున్న రైతులు సహకరిస్తేనే.. ఈ నీరు సరిపోతుంది. కాలువకు ఏమాత్రం అంతరాయాలు కల్పించినా ఈ నీటితో అన్ని చెరువులను నింపడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీనికి తోడు పీఏబీఆర్ జలాశయంలో నీటి నిల్వ హెచ్చెల్సీ అధికారులను కలవరపెడుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.1 టీఎంసీలు మాత్రమే నీరు ఉంది. గతంలో 4 టీఎంసీలు నీరు నిల్వ ఉంచుకున్న తర్వాత కుడికాల్వకు నీటిని విడుదల చేయడం ఆనవాయితీగా ఉంది. దీని వలన చెరువులకు ఒకేసారి నీటిని విడుదల చేస్తే త్వరగా నింపడానికి సాధ్యమవుతుంది. అయితే ఈ ఏడాది నేతల మధ్య అభిప్రాయ బేధాలతో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ముందుగానే నీటిని తీసుకుపోతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో హెచ్చెల్సీ కింద ఆయకట్టు పూర్తయిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేసిన జీవో ప్రకారం రివర్స్‌డైవర్షన్ పద్దతిలో పీఏబీఆర్‌కు వచ్చే అదనపు జలాలను రిజర్వాయర్‌లో నింపుకున్న తర్వాతనే చెరువులకు వదిలేవారు.
కానీ అనవాయితీలను తలదన్ని ఈ ఏడాది నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 28వ తేదీన ముఖ్యమంత్రి తాడిపత్రి పర్యటన ఖరారైంది. ఆయన చేతుల మీదుగా చాగ ల్లు రిజర్వాయర్‌ను ప్రారంభించాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి భావిస్తున్నారు. ఆలోగా రిజర్వాయర్ నింపాలని హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకే సమయంలో అటు పంటలు, ఇటు కుడికాల్వ చెరువులకు నీటి విడుదల జరుగుతున్న సమయంలో చాగల్లు రిజర్వాయర్‌కు నీటి విడుదల ఎలా సాధ్యపడుతుందని హెచ్చెల్సీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 1.5 టీఎంసీల సామర్థ్యంతో పెన్నానదిపై చాగల్లు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తైఏళ్లు గడుస్తున్నా ఒక సారి కూడా ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. ఈ ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తుండడంతో హెచ్చెల్సీ నార్త్ కెనాల్ 55వ కిలోమీటర్ నుంచి కాలువ తవ్వి.. దాని గుండా నీటిని వదలాలని భావిస్తున్నారు. అయితే కొత్త రిజార్వాయర్ కావడంతో ఇసుకలోకి ఎంత నీరు ఇంకుతుందో అర్థం కావడం లేదు. దీనికి తోడు సమయం కూడా దగ్గర పడుతుండడంతో హెచ్చెల్సీ అధికారులకు కత్తిమీద సాములా మారుతోంది.
హంద్రీనీవాపైనే ఆశలు
పీఏబీఆర్ చెరువులు, హెచ్చెల్సీ కింద ఆయకట్టు పంటలు గట్టెక్కాలంటే ఇప్పుడు అందరికీ హంద్రీ-నీవానే శరణ్యంగా మారుతోంది. ఎలాంటి కేటాయింపులు లేకుండా బ్యాక్ వాటర్‌ను మాత్రమే హంద్రీ-నీవా ద్వారా తీసుకుంటున్నాం. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గుముఖం పడితే జిల్లాలో అంతే సంగతులు. ఇప్పటికే రిజర్వాయర్‌లోకి వరద నీరు తగ్గుముఖం పట్టడడంతో రాయలసీమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం వద్ద విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగార్జున సాగర్‌కు వదులుతున్న నీటిని నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం.
ఒకవేళ నీటిని తీసుకోవడానికి ఇబ్బందులు కలిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందనే ఆందోళనను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హంద్రీ-నీవా ద్వారా 800 క్యూసెక్కులు పీఏబీఆర్‌లోకి వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా కుడికాల్వ చెరువులకు వదలాలని నిర్ణయించారు. చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడానికి అటు పీఏబీఆర్‌లోనూ, మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లోనూ అవసరమైనంత నీరు అందుబాటులో లేదు.
పీఏబీఆర్ కుడికాల్వ ద్వారా చెరువులకు లేదాచాగల్లు రిజర్వాయర్ ఏదో ఒకదానికైతేనే నీటి విడుదల సాధ్యపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని ఒకేసారి అంటే రిజర్వాయర్‌లను ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో హంద్రీ-నీవాకు ఇబ్బందులు తలెత్తితే హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటల సాగుకు పెట్టుబడి రూపంలో రూ.కోట్లు ఖర్చు పెట్టిన అన్నదాతలు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవాంతరాలను తొలగిస్తున్నాం : మురళీనాథ్‌రెడ్డి, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
కుడికాల్వ ద్వారా 49 చెరువులను నింపడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కాలువలో నీటి సరఫరాకు సమస్యగా మారిన నాలుగు కల్వర్టులను తొలగించాం. సోమవారం నుంచి 45 రోజుల పాటు చెరువులకు వదులుతాం. తొలి విడతలో 25 శాతం నింపుకుంటూ వెళ్లి రెండోవిడతలో పూర్తిగా నింపాలని ప్రణాళికలు తయారు చేశాం. చాగల్లు రిజర్వాయర్ నింపే యోచన కూడా ఉంది.