బద్వేలు (అట్లూరు) : వారంతా పదేళ్లుగా ప్రతి నెలా రెండు వందల రూపాయలు పింఛన్ తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక వెయ్యి రూపాయల పింఛన్ వస్తుందని ఆశించారు. అయితే గ్రామ కమిటీల సభ్యులు టీడీపీకి ఓట్లు వేయలేదని కొందరి పింఛన్లు తొలగించారు. దీనిపై సర్పంచ్ సహకారంతో లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. లబ్ధిదారులందరికీ పింఛన్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. బద్వేలు మండల పరిధిలోని పుట్టాయిపల్లి పంచాయతీలో పుట్టాయిపల్లి, గొడుగునూరు గ్రామాల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదంటూ అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రామ కమిటీల ముసుగులో వృద్ధులు, వితంతువులైన 48 మంది పింఛన్లు తొలగించారు.
తన ఆమోదం లేకుండా పింఛన్లు ఎలా తొలగిస్తారని సర్పంచ్ వంకెల జయరామిరెడ్డి అధికారులకు విన్నవించారు. గ్రామ కమిటీ సభ్యులు వారి పేర్లు తొలగించారని, తాము ఏమీ చేయలే మని నిస్సహాయత వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు సర్పంచ్ సహకారంతో హైకోర్టును ఆశ్రయించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు వీర ందరికీ 2014 ఆగస్టు నెల నుంచి పింఛన్ అందజేయాలని ఈనెల 3న తీర్పు చెప్పింది. తమకు తిరిగి పింఛన్ వచ్చేందుకు సహకరించిన సర్పంచ్ జయరామిరెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
కోర్టు న్యాయం చేసింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన పింఛన్ పదేళ్లుగా ఐడీ నెంబరు 412827తో నెలనెలా తీసుకొంటున్నా. ఈ ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి, ఉన్న పింఛన్‌ను రద్దు చేసింది. ఎలా బతకాలా అని మదన పడుతుంటే కోర్టు తీర్పు పుణ్యమా అని మళ్లీ పింఛన్ తీసుకోనున్నాను.
- పాణ్యం బాలనరసింహులు.
గొడుగునూరు, పుట్టాయిపల్లి పంచాయతి
ఓటు వేయలేదని పింఛన్ తొలగించారు
పదేళ్లుగా ఐడీ నెంబరు 437177తో పింఛన్ తీసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదని నా పింఛన్ తొలగించారు. ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారు.
- యారం వెంకట సుబ్బారెడ్డి, గొడుగునూరు. పుట్టాయిపల్లి పంచాయతి
పింఛన్ ఎలా ఆపేస్తారు?
Published Fri, Mar 13 2015 2:36 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement
Advertisement