పీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తే కేసు పెట్టరా? | Chandrababu Naidu Counter To BJP Leaders | Sakshi
Sakshi News home page

పీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తే కేసు పెట్టరా?

Published Sat, Jul 14 2018 8:34 AM | Last Updated on Wed, Aug 15 2018 5:48 PM

Chandrababu Naidu Counter To BJP Leaders - Sakshi

మాట్లాడుతున్న బీజేపీ నాయకులు  పుత్తా లక్ష్మీరెడ్డి, నరసింహాప్రకాష్‌

ప్రొద్దుటూరు : సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను పుట్టపర్తి సర్కిల్‌లో దహనం చేసిన టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయని పోలీసులు.. సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశామని తమపై కేసు నమోదు చేయడం ఎంత వరకు సబబని బీజేపీ నాయకులు పుత్తా లక్ష్మీరెడ్డి, నరసింహా ప్రకాష్‌ అన్నారు. స్థానికంగా వారు శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా గురించి పట్టించుకోని సీఎం చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నాయని ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి 17న స్థానిక టీడీపీ ప్రముఖులు పుట్టపర్తి సర్కిల్‌లో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారన్నారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

అయితే తమ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాపై దాడి చేసిన నేపథ్యంలో మే 12న సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను తమ పార్టీ నాయకులు దహనం చేశారన్నారు. ఇందుకు సంబంధించి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ మోతుకూరి వెంటరమణతోపాటు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట రాఘవేంద్రారెడ్డి, బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడు భూమిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బీజేపీ పట్టణాధ్యక్షుడు వంకదారి నరేంద్రరావు, చలపతిరావు, శూలం శివప్రసాద్‌పై కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు ప్రధానమంత్రికి ఒకలాగా, సీఎంకు మరోలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement