‘మార్పు’ మంచిదేగా! | Huge Changes In The Kurnool District Police Department | Sakshi
Sakshi News home page

‘మార్పు’ మంచిదేగా!

Published Mon, Jul 22 2019 2:09 PM | Last Updated on Mon, Jul 22 2019 2:12 PM

Huge Changes In The Kurnool District Police Department - Sakshi

పోలీసులంటే..ప్రజా రక్షకులు. శాంతిభద్రతల పరిరక్షకులు. జనం మాన, ప్రాణాలను, ఆస్తులను కాపాడుతూ..వారితో మమేకమై పనిచేయాల్సిన బాధ్యత వారిది. కానీ ‘మమేకం’ అనేది మాటలకే పరిమితమవుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ సంగతి పక్కనపెడితే...వారి వ్యవహారశైలి  ప్రజల అసంతృప్తికి కారణమవుతోంది. స్టేషన్‌ మెట్లెక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. కానీ నేడు ఆ శాఖలో చేపడుతున్న ప్రక్షాళన చర్యలు ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తాయన్న ఆశలను రేకెత్తిస్తున్నాయి. 

సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల  తర్వాత జిల్లా పోలీసు శాఖలో భారీ మార్పులు జరిగాయి. డీఎస్పీలు మొదలుకుని కానిస్టేబుళ్ల వరకు బదిలీ అయ్యారు. దాదాపు అన్ని సర్కిళ్లకు కొత్త సీఐలు వచ్చారు. ఎన్నికల్లో జిల్లాకు వచ్చిన ఎస్‌ఐలను కూడా బదిలీ చేశారు. ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, భారీసంఖ్యలో కానిస్టేబుళ్లు సైతం ఇటీవల బదిలీ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని స్టేషన్లలోనూ ‘కొత్త ముఖాలు’ కొలువుదీరిన నేపథ్యంలో పోలీసు శాఖ పనితీరులో మార్పుపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు.
 
సీఐలే కీలకం.. 
పోలీసు శాఖలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల పాత్ర కీలకం. కేసులను లోతుగా దర్యాప్తు చేయాలంటే వీరి వల్లే సాధ్యం. స్టేషన్లలో కొన్ని సంస్కరణలు చేయాలన్నా వీరి పరిధిలోనే ఉంటుంది. రెండు,మూడు స్టేషన్లకు బాధ్యులుగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సీఐల బదిలీలు దాదాపు పూర్తయ్యాయి. కొందరు స్టేషన్ల వరకే మారగా.. మరికొందరు ట్రాఫిక్, ఏసీబీ, ఎస్‌బీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్‌ విభాగాలకు బదిలీ అయ్యారు. లా అండ్‌ ఆర్డర్‌కు వచ్చిన వారంతా శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. జిల్లాలోని స్టేషన్లలో పెండింగ్‌ కేసులు చాలా ఉన్నాయి. వీటిని ఏ మేరకు పరిష్కరిస్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.  
జిల్లాలో భారీ పోలీసు వ్యవస్థ  
జిల్లాలో భారీ పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంది. 83 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి.  దాదాపు 32 స్టేషన్లకు ఎస్‌హెచ్‌ఓలుగా సీఐలే ఉన్నారు. వీటి పరిధిలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా విజ్ఞప్తుల దినంలో వచ్చే అర్జీలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 

ఈ పరిస్థితి మారాలి! 
మామూళ్లు ఇవ్వనిదే పోలీసులు పలికే పరిస్థితి లేదని సామాన్యులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వసూళ్ల కోసం కొన్ని స్టేషన్లలో మఫ్టీ బృందాలను నియమించుకున్నారు. మరికొన్ని స్టేషన్లలో రైటర్లదే రాజ్యం. ముఖ్యంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్టేషన్లలో ప్రతి పనికీ చేయి తడపాల్సిందే. ఏదైనా పనిపై స్టేషన్‌కు వెళితే కనీసం రూ.5 వేలు ముట్టజెప్పాల్సి వస్తోంది. రాష్ట్ర సరిహద్దు కావడంతో  కర్నూలు మీదుగా నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటాయి. వాటి నుంచి ఏదో రూపంలో మామూళ్లు దండుకోవడం పోలీసులకు అలవాటుగా మారింది. ఇలాంటి వాటిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే పలు ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీ పెంచాల్సిన అవసరం ఉంది. పాత నేరస్తులపై నిఘా పెరగాలి. వారి కదలికలపై నిత్యం ఆరాతీస్తే తప్ప దొంగతనాలకు అడ్డుకట్ట పడదు. ఇటీవల కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు రోడ్డులో రెండు కుటుంబాలపై దాడి చేసి.. దోపిడీకి పాల్పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

నగర పరిధిలో ఆరుగురు సీఐలు  
కర్నూలు నగర పరిధిలో నాలుగు స్టేషన్లతో పాటు కర్నూలు అర్బన్‌ తాలూకా, రూరల్‌ తాలూకా పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. జిల్లా కేంద్రం కావడంతో ఈ ఆరు స్టేషన్లకూ ఎస్‌హెచ్‌ఓలుగా సీఐలే వ్యవహరిస్తున్నారు. వీరి పరిధిలోనే స్టేషన్ల పర్యవేక్షణ ఉంటుంది. పెద్ద కేసులన్నీ వీరే చూస్తుంటారు. ప్రస్తుతం ఆరు స్టేషన్లలోనూ కొత్తవారు కొలువుదీరారు. వీరి ఆధ్వర్యంలో నగరంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా నగరంలో దొంగతనాలు పెరిగాయి. ఇళ్ల ముందు పార్క్‌ చేసి ఉంచిన వాహనాలు మాయమవుతున్నాయి. రౌడీషీటర్లు పేట్రేగిపోతున్నారు. వివాదాలు ఎక్కువయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి దోపిడీ ముఠాలు సునాయాసంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి.  పోలీసులు రాత్రిళ్లు గస్తీ మరిచారు. ఈ నేపథ్యంలో దొంగలు  తడాఖా చూపుతున్నారు. వీటిపై నూతన సబ్‌డివిజన్‌ అధికారులు, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. 

పేరుకుపోయిన పెండింగ్‌ కేసులు  
పోలీసు స్టేషన్‌ స్థాయి నుంచి సబ్‌డివిజన్‌ స్థాయి వరకు పెండింగ్‌ కేసులు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. బాధితులు తమ కేసులు పరిష్కారం కావడం లేదంటూ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఒక వైపు అధికారులు చెబుతున్నప్పటికీ.. కర్నూలు మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారుల్లోనూ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రతి సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు కొరవడ్డాయి. కొత్త అధికారుల పాలనలోనైనా శాంతిభద్రతలు గాడిన పడతాయని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement