కరీంనగర్‌సిటీ: జిల్లాలో డిసెంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తప్పనిసరి బదిలీలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జిల్లా పరిధిలో మూడేళ్లకు పైగా విధులు నిర్వహించిన, సొంత జిల్లాలకు చెందిన అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. జిల్లావ్యాప్తంగా 13 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు కేటాయించారు. అలాగే 12 మంది ఇతర జిల్లాలకు చెందిన తహసీల్దార్లను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు జరిగే సమయాల్లో కచ్చితంగా దీర్ఘకాలికంగా జిల్లాలో విధులు నిర్వహించే, సొంత జిల్లా వర్తించే అధికారులను బదిలీ చేయడం సాధారణంగా మారింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేస్తున్న క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం లభించకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో పనిచేసిన వివిధ శాఖల అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉంటాయని భావించి బదిలీలు చేపట్టారు. బదిలీలకు సంబంధించి 2018 నవంబర్ 30 నాటికి కటాఫ్‌గా తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది. ఈ తేదీ నాటికి ఏ పోస్టింగులోనైనా మూడేళ్లు పూర్తి చేసుకునే అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 57 మండలాలతోపాటు కొత్తగా ఏర్పడిన 14 మండలాలతో కలిపి 71 మండలాలలో తహసీల్దార్లు పనిచేస్తున్నారు.
వీరంతా ఎన్నికల విధుల్లో సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. దాదాపు 15 మండలాల్లో డీటీలు ఇన్‌చార్జి తహసీల్దార్లుగా ఉన్నారు. వీరిలో దాదాపు సగానికి పైగా బదిలీలు జరిగాయి. ఎన్నికల సమయంలో సంబంధిత అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే ఏదైనా సందర్భంలో అవకతవకలకు ఆస్కారముంటుందని ఈసీ భావించింది. రెవెన్యూ యంత్రాంగంలో తహసీల్దార్లతోపాటు ఎంపీడీవోలు, పోలీసులకూ బదిలీలు తప్పవు. ఎంపీడీవోల బదిలీలపై కసరత్తు సాగుతోంది. అయితే.. ఎంపీడీవోలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన తీసుకోవాలా? కొత్త జిల్లాల ప్రామాణికమా? అనే విషయంపై ఉన్నత స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే ఆర్డీవోల బదిలీ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. కరీంనగర్‌కు ఇటీవలే కొత్త ఆర్డీవో, డీఆర్‌వోలను కూడా కేటాయించారు.
కరీంనగర్ నుంచి ఇతర జిల్లాలకు..
కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న 13 మంది తహసీల్దార్లను ఇతర జిల్లాలకు కేటాయిస్తూ సీసీఎల్‌ఏ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో సీహెచ్ కోమల్‌రెడ్డి జగిత్యాలకు, డి.రాజయ్య జగిత్యాలకు, జి.సవిత జగిత్యాలకు, బి.రాజేశ్వరి జగిత్యాలకు, ఎన్.వెంకట్‌రెడ్డి జగిత్యాలకు, జె.జయంత్ పెద్దపల్లికి, కె.రమేశ్ పెద్దపల్లికి, టి.రవీందర్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు, చిల్ల శ్రీనివాస్ కొమురంభీం ఆసిఫాభాద్‌కు, సయ్యద్ ముబీన్ అహ్మద్ మంచిర్యాలకు, జి.సదానందం వరంగల్ రూరల్‌కు, ఎ.జగత్‌సింగ్ వరంగల్ అర్బన్, ఐ.బావ్‌సింగ్ వరంగల్ అర్బన్ జిల్లాలకు కేటాయించారు.
ఇతర జిల్లాల నుంచి కరీంనగర్‌కు..
ఎ.మోథీరామ్ (ఆదిలాబాద్), కె.రవిరాజా కుమార్‌రావు (జయశంకర్ భూపాలపల్లి), జె.రాజలింగం (మంచిర్యాల), డి.కవిత (మంచిర్యాల), సాయిబాబా (మంచిర్యాల), జి.కుమారస్వామి (మంచిర్యాల), ఎ.రజిత (పెద్దపల్లి), కె.కనకయ్య (వరంల్ రూరల్), జి.శ్రీనివాస్ (వరంగల్ రూరల్), పి.హరికృష్ణ (వరంగల్ రూరల్), కె.రత్నవీరచారి (వరంగల్ రూరల్), కె.నారాయణను కరీంనగర్ జిల్లాకు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment