గణేశ్ ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు.
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : గణేశ్ ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. శనివారం స్పెషల్ బ్రాంచ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రణాళిక తయారు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, బందోబస్తు విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఖానాపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, ఉట్నూర్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టాలని, ప్రధాన కూడళ్ల దగ్గర పీకెటింగ్, ప్రార్థన స్థలాల్లో పోలీసు పహారా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎప్పటికప్పుడు పేకాట స్థావరాలు, క్లబ్‌లపై దాడులు నిర్వహించి జూదాన్ని అరికట్టాలని ఆదేశించారు. కొంతమంది అసాంఘిక శక్తులు చేసే వదంతులు ప్రజలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పోలీసు అధికారులు అందుబాటులో ఉండి స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో యాంటీ సాబోటేజ్ చెకింగ్, వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాల ఉపయోగం, పోలీసు వీడియోగ్రాఫర్లను, అనుమానిత ప్రాంతాల్లో బాంబ్ స్వ్కాడ్‌ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పోలీసులు సెలవుపై వెళ్లకుండా పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించి ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను పూర్తి చేసి ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరిగేలా చూడాలని కోరారు. ఇన్‌స్పెక్టర్లు కె.సీతారాములు, ఎస్.బాలరాజు, రాగ్యానాయక్, ఎస్సైలు అన్వర్‌ఉల్లాహక్, ఎంఏ కరీం, టీడీ నందన్ , తాజొద్దీన్ పాల్గొన్నారు.