రామచంద్రపురం :ఈనెల 23న ఇంటిలో అనుమానాస్పదంగా మృతి చెందిన పడగ వెంకటలక్ష్మి(29)ది ఆత్మహత్యకాదని, హత్యేనని పోలీసులు నిర్ధారించారు. భార్యను కడతేర్చి, ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరినీ నమ్మించేందుకు ఆమె భర్త ప్రయత్నించాడని రామచంద్రపురం పోలీసులు పేర్కొన్నారు. సీఐ పి.కాశీవిశ్వనాథ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండపేట మండలం జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన పడగ అంజి రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని 2006లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచీ చక్రద్వారబంధంలో అత్తవారింటిలోనే భార్యతో కలసి ఉంటున్నాడు.
అయితే పిల్లలు పుట్టలేదనే నెపంతో అతడు తరచుగా వెంకటలక్ష్మిని వేధిస్తుండేవాడు. కొంతకాలంగా వారిద్దరూ ఘర్షణ పడుతుండడంతో అత్తింటివారు పెద్దల సమక్షంలో నాలుగు నెలల క్రితం వారితో రామచంద్రపురంలో వేరే కాపురం పెట్టించారు. శ్రీరాంపేటలో ఒక ఇంట్లో వీరు అద్దెకు దిగారు. అంజి పెట్రోల్‌బంక్‌లో పనికి కుదిరాడు. పెళ్లయి ఎనిమిదేళ్లయినా పిల్లలు పుట్టడంలేదని భార్యతో ఘర్షణ పడుతున్న అంజి ఎలాగైనా ఆమెను హతమార్చాలని భావించాడు. ఈనెల 23న ఉదయం నుంచి భార్యతో అతడు గొడవ పడుతున్నాడు. బంక్ నుంచి మధ్యాహ్నం ఇంటికివచ్చిన అంజి తాడుతో భార్య మెడకు బిగించి చంపేశాడు.
ఆపైన గదిలో ఉరి వేసుకున్నట్టుగా పరిస్థితి కల్పించి చుట్టుపక్కల వారిని నమ్మించాడు. ఆపైన భార్య మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే గదిలో వెంకటలక్ష్మి మృతి చెందిన తీరు, భర్త అంజి పరారు కావటం అనుమానం కలిగించడంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారని సీఐ తెలిపారు. ఈనెల 26న శ్రీరాంపేటలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు వచ్చినపుడు అంజిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో పాల్గొన్న ఎస్సై ఫజల్హ్మ్రన్, ఏఎస్సై లాల్, హెచ్‌సీ సుబ్బారావు, పీసీలు వీరబాబు, వెంకటరమణ, కుమార్‌రాజా, విజయ్, సత్యనారాయణలను సీఐ కాశీవిశ్వనాథ్
అభినందించారు.
హత్య చేసింది భర్తే !
Published Wed, Jan 28 2015 12:19 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement