
చేతబడి చేయిస్తుందని....
అనంతపురం(కదిరి) : భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్తే గొడ్డలితో నరికిచంపిన దారుణ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా కదిరి మండలం కట్టెల తాండాకు చెందిన బాణీబాయ్, పారేసు నాయక్‌లు భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరూ కేరళకు వెళ్లి కూలి పనులు చేసుకునేవారు. అయితే తాను అనారోగ్య పడడానికి, సన్నబడిపోతుండడానికి భార్య తనకు చేతబడి చేయిస్తుందని పారేసు అనుమానం పెంచుకున్నాడు.
అదే క్రమంలో ఎలాగైనా భార్యను హతమార్చాలనుకుని ఆమె నిద్రిస్తుండగా సోమవారం తెల్లవారుజామున గొడ్డలితో మెడపై విచక్షణారహితంగా నరికి చంపేశాడు. ఇది చూసిన కుమార్తె భయపడి పెద్దగా కేకలు వేసింది. కేకలు విన్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
అయితే హత్యకు అసలు కారణం అది కాదని, తన భార్య పరాయి మగాళ్లతో చనువుగా మాట్లాడుతుండడం చూసి వివాహేతర సంబంధాలు ఉన్నాయేమోనని అనుమానపడి ఈ పని చేసిఉంటాడని పలువురు తాండా వాసులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతుండేవారని చెబుతున్నారు. గత రాత్రి కూడా డబ్బుల విషయమై తల్లి, తండ్రి గొడవ పడ్డారని కుమార్తె చెపుతోంది. వారం క్రితం కూడా పారేసు నాయక్ గొడవపడి భార్యను కొట్టగా ఆమె తలకు గాయాలయ్యాయి.