హైదరాబాద్ ఆస్తికాదు..అస్తిత్వం | hyderabad is not a property of seemandhra, its an identity :manjeera writers association | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఆస్తికాదు..అస్తిత్వం

Published Mon, Oct 28 2013 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

హైదరాబాద్ ఆస్తికాదు..అస్తిత్వం

హైదరాబాద్ ఆస్తికాదు..అస్తిత్వం

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌పై పాలనాధికారం తెలంగాణకే ఉండాలని మంజీరా రచయితల సంఘం 27వ వార్షికోత్సవ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అందుకు భిన్నంగా ఉండే ఎలాంటి నిర్ణయాన్నైనా అంగీకరించబోమని స్పష్టం చేసింది. మంజీరా రచయితల సంఘం 27వ వార్షికోత్సవ సభ ఆదివారం హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ప్రొఫెసర్లు జి.హరగోపాల్, ఎ.శివారెడ్డి, జి.చక్రపాణి, సంపాదకులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, ఎన్.వేణుగోపాల్, ప్రొఫెసర్లు ఎ.శివారెడ్డి, ఎమ్మెల్యే టి.హరీష్‌రావు, వరవరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, కె.రవీందర్‌రెడ్డి, మంజీరా రచయితల సంఘం నేతలు నందిని సిధారెడ్డి, దేశ్‌పతి శ్రీనివాస్ తదితరులు ఈ సభలో ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఉండటానికి అందరిదే అయినా పరిపాలనాధికారం మాత్రం తెలంగాణకే ఉండాలని, అందుకు భిన్నంగా ఉండే ఏ నిర్ణయాన్నైనా అంగీకరించవద్దని సభ తీర్మానించింది.

 

హైదరాబాద్ సాంస్కృతిక చరిత్రపై లోతుగా పరిశోధన జరగాలని, సాంస్కృతిక పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కోదండరాం మాట్లాడుతూ.. సీమాంధ్ర సంపన్నులకు హైదరాబాద్ ఒక ఆస్తిగానే కనబడుతున్నదని, తెలంగాణ ప్రజలేమో అస్తిత్వం కోసం హైదరాబాద్‌లో దేవులాడుకుంటున్నారని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో జీవనం, సంస్కృతి, పరిపాలన విధ్వంసమయ్యాయని విమర్శించారు. సీమాంధ్రులకు హైదరాబాద్ అడ్డాగా మారిపోయిందని, కాళ్లకు చెప్పులు లేకుండా నగరానికి వచ్చిన వాళ్లు ఏసీ కార్లలో వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

 

హైదరాబాద్ వనరులన్నీ హైదరాబాదీలకే చెందాలన్నారు. హైదరాబాద్‌లో రకరకాల వృత్తులు ఉన్నాయని, ఆ వృత్తులను సీమాంధ్రులు పాతరేశారని ధ్వజమెత్తారు. హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు నగరాన్ని వ్యాపారకేంద్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఎంతో విశాలమైన హుస్సేన్‌సాగర్‌ను చుట్టూ మట్టి నింపి సినిమా థియేటర్లకు ఇచ్చేశారని.. బ్యూటిఫికేషన్ పేరిట గుడిసెలను తొలగించారని మండిపడ్డారు. భూములను ఆక్రమించుకోవడానికి శివార్లలోని మునిసిపాలిటీలను, గ్రామ పంచాయతీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసుకున్నారని ఆరోపిం చారు. దానివల్ల అధికార కేంద్రీకరణ జరిగి, సామాన్య ప్రజలకు పరిపాలనాపరమైన ఇబ్బందులు వచ్చాయని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ పునరుజ్జీవానికి కృషి చేసుకుంటామని, జీహెచ్‌ఎంసీతో విధ్వంసాన్ని నిరోధించేందుకు.. మునిసిపాలిటీలుగా విభజించి పాత హైదరాబాద్‌ను పునర్నిర్మించుకుంటామని చెప్పారు. అనంతరం ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు ఆత్మ వంటిదన్నారు. చుట్టూ ఉన్న జిల్లాల ప్రజల శ్రమతో హైదరాబాద్ ఇప్పటి రూపును సంతరించుకున్నదని పేర్కొన్నారు.
 
 పరిపాలనా అధికారం తెలంగాణకే ఉన్నా ఎవరూ ఇక్కడి నుండి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని కె.రామచంద్రమూర్తి చెప్పారు. భౌగోళికంగా పూర్తిగా తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న హైదరాబాద్ తెలంగాణదేనని, దీనిపై మరో ప్రస్తావన, చర్చ అవసరం లేదని కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. విప్లవకవి వరవరరావు మాట్లాడుతూ.. తెలంగాణవాదంలో ముస్లింలు ఎందుకు వెనుకబడి ఉన్నారని, తెలంగాణవాదం ముసుగులో హిందూయిజాన్ని నెత్తికెత్తుకున్నామా? అని ప్రశ్నించారు.
 
 తెలంగాణ ఎజెండాలో ముస్లిం లు, లౌకికవాదం ఉన్నాయా? అని నిలదీశారు. దోపిడీదారుడు ఆంధ్రావాడైనా, తెలంగాణవాడైనా హైదరాబాద్ నుండి పోవాల్సిందేనన్నారు. శ్రమించి చెమట చిందించేవారు ఎవరైనా, ఎక్కడి వారైనా హైదరాబాద్ వారిదేనని పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లో పుట్‌పాత్‌లై పె నడిచే, ఇరానీ కేఫ్‌లలో చాయ్ తాగే పరిస్థితి వస్తుందా?.. కనీసం అప్పటి విలువలు, సంస్కారం, ప్రేమ వంటివైనా హైదరాబాద్ తెహజీబ్‌లో తేగలమా?’ అని వరవరరావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే టి.హరీష్‌రావు మాట్లాడుతూ.. ఢిల్లీ నుండి సీల్డు కవరులో వచ్చిన సీఎం కిరణ్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని, తెలంగాణను ఆపడం ఆయ న తరం కాదని వ్యాఖ్యానించారు. ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి తెలంగాణలో ఎక్కువగా ఉండటం వల్లనే కేంద్ర పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు.  సీమాంధ్ర పాలకుల కన్నా నిజాం పాలకులే అభివృద్ధి చేశారని ప్రొఫెసర్ చక్రపాణి వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement