బస్తీ బాలుడు.. భళా అనిపించాడు... | Hyderabad Slum Boy shine in english talent test | Sakshi
Sakshi News home page

బస్తీ బాలుడు.. భళా అనిపించాడు...

Published Sun, Sep 1 2013 9:53 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

Hyderabad Slum Boy shine in english talent test

హైటెక్‌సిటీ చెంతన ఓ బస్తీలోని ఇరుకు గదిలో నివాసం. తండ్రి కూలీ. తల్లి హౌస్‌కీపర్. వీరి అబ్బాయి నర్సింహ విద్యా ప్రమాణాలు మచ్చుకైనా లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. అయితేనేం.. ప్రతిభకు అవేవీ ఆటంకం కావని నిరూపించాడు. లక్షలకు లక్షలు పోసి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో పోటీపడి ఆంగ్లభాషా ప్రావీణ్యంలో విజయకేతనం ఎగురవేశాడు. భవిష్యత్తులో పోలీస్ అధికారి కావాలనుకొంటోన్న ఆ విద్యార్థి సక్సెస్ స్టోరీ..
 
సున్నాల్లేని గోడలు, గొళ్లాల్లేని తలుపులు... ఇరుకిరుకు గదులు, సమయానికి రాని మాస్టార్లు, నాణ్యతలేని మధ్యాహ్న భోజనం... అరకొర చదువులు... ప్రభుత్వ పాఠశాలలు అనగానే అందరికీ గుర్తుకువచ్చే దుస్థితి. అయితే అలాంటి పరిస్థితుల నుంచి కూడా విశేషమైన విజయాలు పుట్టుకొస్తాయి. అలాంటి విజయం సాధించిన బాలుడు నర్సింహ... ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ‘ఇంటలిజెన్స్’ ముందు దిగదుడుపే అని నిరూపించాడు. రూ.లక్షలు చెల్లించి చదివే విద్యార్థులతో పోటీపడి గెలిచాడు. అది కూడా తెలుగు మీడియం విద్యార్థులను అనుక్షణం భయపెట్టే ఆంగ్లభాషా ప్రావీణ్యంలో...                                           
 
పేదింట్లో విద్యా కుసుమం వికసించింది. తెలుగు భాషలో విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న ఓ బాలుడు శుక్రవారం ఆంగ్ల పదజాలంలో నిర్వహించిన పోటీల్లో కార్పొరేట్ విద్యార్థులను తోసిరాజన్నాడు. మొదటి స్థానంలో నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి వలస వచ్చిన నిరుపేద దంపతుల కుమారుడు రూ.50 వేలు నగదు గెలుచుకున్నాడు.
 
ఇంటిల్లిపాదీ పని... ఒక్కడి చదువు...
మెదక్ జిల్లా కంగ్టి మండలం దేగులవాడి గ్రామానికి మార్జోడి మారుతి ఇరవై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చాడు. భార్య లలితమ్మ, కొడుకులు రవికుమార్, నర్సింహలతో కలిసి గచ్చిబౌలిలోని సిద్దిఖ్‌నగర్‌లో నివాసముంటున్నారు. తండ్రి కూలి పనులు చేసుకుంటుండగా, తల్లి లలితమ్మ, సోదరుడు రవికుమార్‌లు హైటెక్‌సిటీలోని ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు.

ముగ్గురు పనిచేస్తేనే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థోమత లేక చిన్న కొడుకు నర్సింహను అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం నర్సింహ అక్కడ 5వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రుల కష్టం అర్థమైనట్టు... చదువులో రాణిస్తున్న నర్సింహ క్లాస్‌లో అన్నింటా ఫస్ట్ కావడంతో ఆంగ్లభాషా ప్రావీణ్యంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించే అట్లాంటా ఫౌండేషన్ దృష్టిని ఆకర్షించాడు. దీంతో నర్సింహకు ఆంగ్ల పదజాలంలో కొంతకాలం పాటు శిక్షణ ఇచ్చారు.
 
ఔరా..!
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా పోటీలలో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో నర్సింహను ఎంపిక చేస్తే... ఏకంగా విజేతగా నిలిచి నర్సింహ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. అల్లిబిల్లిగా ఉండే ఆంగ్ల అక్షరాలతో పదాలను కూర్చడం, ఉచ్ఛరించిన ఆంగ్లపదాల స్పెల్లింగులు కరెక్ట్ చేయడం... వంటి విభిన్న రకాల అంశాలతో నిర్వహించిన ఈ పోటీకి నగరానికి చెందిన దాదాపు అన్ని టాప్ క్లాస్ కార్పొరేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ల్యాప్‌టాప్‌పై సమాధానాలు ఇస్తూ నర్సింహ ముందు వరుసలో నిలిచాడు.

చివరకి... మాదాపూర్‌లోని మహీంద్రా సత్యంలో శుక్రవారం అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్- 2013-14’ ఫైనల్స్‌లో అందర్నీ తోసిరాజని... అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరఫున ప్రైమరీ స్కూల్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రశంసా పత్రం, మెమొంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని సైతం దక్కించుకున్నాడు.
 
ఎంతో సంతోషంగా ఉంది...
పెద్ద పాఠశాలల్లో చదివే పిల్లలతో పోటీపడి తమ కొడుకు ఛాంపియన్‌గా నిలవడంపై తల్లిదండ్రులు మారుతి, లలితమ్మలు ఆనందం వ్యక్తం చేశారు. చదువంటే ఎంతో ఇష్టమని, అయినా ప్రైవేట్ స్కూల్‌లో చదివించే స్థోమత తమకు లేదన్నారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు.
 
మంచి ఉద్యోగమే లక్ష్యం...
బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని తాను భావిస్తున్నట్లు విద్యార్థి నర్సింహ తెలిపారు. పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మొదట్లో ఇంగ్లిష్‌లో చదవాలంటే భయం వేసేదని చెప్పారు. ఆ తరువాత మేడం రోజూ క్లాస్ తీసుకోవడంతో భయం పోయిందన్నారు.
 
సృజనాత్మకతను వెలికి తీసేందుకే...
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లోనూ ప్రతిభకు కొరత ఉండదు. పేద విద్యార్థులకు ఆంగ్ల భాషలో శిక్షణ ఇస్తున్నాం. వారిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే అట్లాంటా ఫౌండేషన్ కొంత కాలంగా కృషి చేస్తోంది. ఛాంపియన్‌గా నిలిచిన అంజయ్యనగర్‌లోని ప్రైమరీ స్కూల్ విద్యార్థి నర్సింహకు నేనే శిక్షణ ఇచ్చా. ఆత్మ స్థైర్యంతో పోటీపడి విజయం సాధించాడు.       
- శేషు, అట్లాంట ఫౌండేషన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement