జీరో గ్రావిటీ అనుభూతి సందర్శకుల సొంతం
స్పందించే రాక్షస బల్లులు,ఆకాశంలో గిరికీలు కొట్టించే రోలర్‌కోస్టర్
అనిశ్చితి తొలగడంతో ముందుకొచ్చిన ప్రైవేటు సంస్థ
దేశంలోనే మొదటిది.. బుద్వేలులో ఏర్పాటు
న్యూజిలాండ్ సాంకేతికత, బ్రిటన్ ఆర్థికసాయం
హైదరాబాద్: చుట్టూ స్వచ్ఛమైన నీళ్లు... అందులో అందమైన చేపలు, ఆకట్టుకునే ఇతర జలచరాలు.. ఆ నీటికింద అద్దాలతో తయారైన సొరంగమార్గం...జలచరాల విచిత్రవిన్యాసాలు అతిదగ్గరగా తిలకిస్తూ... దానిగుండా నడుస్తూ ముందుకుసాగితే...‘జీరో గ్రావిటీ’ వ్యవస్థ సాక్షాత్కారం... అంతరిక్షంలో వ్యోమగాముల మాదిరిగా గాల్లో తేలియాడిన అరుదైన అనుభూతి మనసొంతమవుతుంది. ఆ పక్కకు చూస్తే భయంకర రూపంతో మనల్ని పలకరించే రాక్షసబల్లులు.. మనం వేసే ప్రశ్నలకు అవి క్రూరమైన గొంతుతో సమాధానాలు చెప్పి ఆశ్చర్యపరుస్తాయి... ఇంకొంచెం ముందుకెళితే ఆకాశంలో గిరికీలు కొట్టిం చే రోలర్ కోస్టర్.. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన ఈ అద్భుత వినోదాల విందు త్వరలో హైదరాబాద్‌లో కూడా లభించబోతోంది. దేశంలోనే తొలి ప్రయత్నంగా ఈ భారీ ప్రాజెక్టు నగరంలో సిద్ధం కానుంది. న్యూజిలాండ్, బ్రిటన్‌ల సాంకేతిక, ఆర్థిక సహకారంతో ఓ సంస్థ దీని నిర్మాణానికి ముందుకొచ్చింది. వాస్తవానికి ఈ సంస్థ గతంలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఉత్సాహం చూపినా... స్థానికంగా రాజకీయ అనిశ్చితి కొనసాగుతుండడంతో వెనకడుగు వేసింది. ఇప్పుడు రాష్ట్ర విభజన పూర్తయి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం కావటంతో ఆ సంస్థ ముందుకొచ్చింది. ప్రాథమికంగా రూ.150 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు.
ప్రత్యేకతలెన్నో: నగరంలో అండర్ వాటర్ అక్వేరియం నిర్మాణం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరాలం జలాశయం నీటిని ఆధారం చేసుకుని జూపార్కు పక్కన ఇలాంటి ప్రాజెక్టు కోసం గతంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీ ఏ) ప్రయత్నించింది. ఆరు సంస్థలు ముందుకొచ్చినా ఆర్థికమాంద్యం వల్ల ప్రాజెక్టు చేపట్టలేకపోయాయి. ఇప్పుడు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ నగర శివారులోని బుద్వేల్‌లో ఈ ప్రాజెక్టు కేటాయించేందుకు ముందుకురావడంతో ‘బిగ్ బ్లూ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటె డ్’ అనే సంస్థ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. బ్యాంక్ గ్యారం టీతోపాటు డీపీఆర్‌ను అందజేసింది. దీంతో స్విస్ చాలెంజ్ పద్ధతిలో అధికారులు పత్రికల్లో ప్రకటనలిచ్చినా వేరే సంస్థలు రాకపోవడంతో ఆ సంస్థకే ప్రాజెక్టును కేటాయించారు. బుద్వేల్‌లో ఇందుకోసం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో 8 ఎకరాల్లో అండర్‌వాటర్ అక్వేరియం రూపుదిద్దుకోనుండగా మిగతా స్థలంలో ‘జీరో గ్రావిటీ ప్రాజెక్టు’, ‘ఇంటరాక్టివ్ డైనోసార్, రోలర్ కోస్టర్, రెస్టారెంట్స్, రిసా ర్ట్స్.. ఇలా పలు వినోదకేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు న్యూజిలాండ్‌కు చెందిన ఓ సంస్థ సాంకేతిక సాయం అందిస్తుం డగా, బ్రిటన్‌కు చెందిన మరో సంస్థ ఆర్థిక చేయూతనివ్వనుందని అధికారులు చెబుతున్నారు. ముంబైలోని తారాపూర్‌వాలా అక్వేరియం, చండీగఢ్, సూరత్‌లలోని టన్నల్ అక్వేరియంలు మాత్రమే ఇప్పటివరకు దేశంలో గుర్తింపు పొందాయి. కానీ విదేశీ తరహాలో భారీ అండర్‌వాటర్ అక్వేరియం హైదరాబాద్‌దే కాబోతోందని అధికారులు చెబుతున్నారు. లీజ్ రెంట్‌తోపాటు అక్వేరియం ఆదాయంలోనూ ప్రభుత్వానికి వాటా ఉండడంతో ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు.
భాగ్యనగరంలో భారీ అక్వేరియం!
Published Sat, May 24 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement