విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కుకు శనివారం జత హైనాలు(దుమ్మలగుండిలు) వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జూ పార్కు నుంచి జత హైనాలను ఇక్కడికి జూ అధికారులు తీసుకొచ్చారు. ఒకటిన్నర సంవత్సరాల వయసు గల స్వాతి అనే ఆడ హైనా, రెండేళ్ల వయసు గల సామ్రాజ్ అనే మగ హైనా ఇక్కడికి చేరుకున్నాయి. వాటికి బదులు ఇక్కడ నుంచి సావిత్రి అనే పేరుగల ఒక ఆడ తెల్లపులిని కాన్పూర్ జూకి పంపించారు. ఈ హైనాలను తీసుకొని కాన్పూర్ జూ డాక్టర్ ఆర్.కె.సింగ్ ఇక్కడికి వచ్చారు.
ఇక్కడ జంతువులు, ఎన్‌క్లోజర్లు, వాటి ఆహారం తదితర వాటిని పరిశీలించారు. ఈ నెల 25న కాన్పూర్‌లో బయల్దేరి హైనాలను లారీలో ఇక్కడికి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వాటికి ఒక్కోదానికి చికెన్, మటన్, బీఫ్ రోజుకు సుమారు 4 కిలోల చొప్పున ఆహారంగా ఇస్తున్నామన్నారు. ఇవి ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. ఇవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన అనంతరం వారం రోజుల్లో సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడిచి పెడతామని క్యూరేటర్ జి.రామలింగం తెలిపారు. ప్రయాణంలో మగ హైనా కాలికి స్వల్ప గాయమైందని, దానికి జూ వైద్యుడు శ్రీనివాస్ వైద్యం అందిస్తున్నారన్నారు.
జూలో హైనాల సందడి
Published Mon, Mar 2 2015 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement