Hyna
-
హైనాల స్థావరం.. గుహ నిండా ఎముకలే
రియాద్ : ఏడు వేల సంవత్సరాల నాటి హైనాల స్థావరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌదీ అరేబియాలోని ఓ లావా గుహలో ఈ స్థావరాన్ని గుర్తించారు. ఈ గుహ మొత్తం ఎముకలతో నిండి ఉంది. ఈ గుహలో దాదాపు 40 రకాల జంతువుల ఎముకలు బయటపడ్డాయి. వీటిలో మనుషులు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, మేకలు, జింకలు, ఇతర హైనాల ఎముకలు సైతం ఉన్నాయి. ఈ గుహ కొన్ని వేల సంవత్సరాల పాటు హైనాలు విందు ఆరగించే ప్రదేశంగా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హైనాలు మాంసం కోసం స్మశాన వాటికలలోని మనుషుల మృతదేహాలను గుహలోకి లాక్కువచ్చుంటాయని అభిప్రాయపడుతున్నారు. 2007లో ఈ గుహను కనుగొన్నప్పటికి లోపలినుంచి జంతువుల అరుపులు వినపడ్డంతో పరిశోధకులు లోపలికి వెళ్లేప్రయత్నం చేయలేదు. ఈ గుహనుంచి పరిశోధనల నిమిత్తం 1,917 ఎముకలు, పళ్లను వెలికి తీశారు. వీటిలో 1,073 ఎముకలు అస్థిపంజరానికి చెందినవిగా గుర్తించారు. 13 శాంపిల్స్‌ను రేడియో కార్బన్ డేటింగ్ టెస్ట్ చేయగా వాటిలో కొన్ని ఎముకలు 6,839 ఏళ్ల నాటి వని తేలింది. హైనాలు ఒకరకంగా చెప్పాలంటే సర్వభక్షకాలు. అయితే, ఎక్కువగా మాంసాహారానికి మొగ్గుచూపుతాయి. ఇతర జంతువుల్ని గుంపుగా వేటాడి, చంపి తింటాయి. ఇతర జంతువులకంటే హైనాల జీర్ణవ్యవస్థ ప్రత్యేకమైనది. జంతువుల అన్ని రకాల ఎముకలను సైతం తిని అరిగించుకోగలవు. -
సింహం సింగిల్‌గా వస్తే..!!
‘నాన్నా.... పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది’.... సింహం ఎంత పవర్ఫుల్లో చెప్పే పాపులర్ డైలాగ్. అయితే సింగిల్‌గా వస్తే సింహాన్నానైనా సరే ఓ ఆట ఆడుకుంటామని నిరూపించాయి గుంపుగా వచ్చిన హైనాలు. ఒంటరిగా ఉన్న సింహం చుట్టూ చేరి దానికి ముచ్చెటమలు పట్టించాయి. అడవికి రాజైతే కావచ్చు గానీ మా ఐకమత్యం ముందు నీ బలం పనికిరాదన్నట్టుగా సింహంతో ఓ ఆట ఆడుకున్నాయి. అయితే చివర్లో మరో సింహం వచ్చి.. తన స్నేహితుడికి అండగా నిలవడంతో హైనాలు తోక ముడవక తప్పలేదు. సవన్నా గడ్డి భూముల్లో హైనాలకు, రెండు మగ సింహాలకు మధ్య జరిగిన పోరుకు సంబంధించిన ఈ వీడియోను బీబీసీ ఎర్త్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి ఇంకేం మీరు కూడా ఓ లుక్కేయండి. -
పళ్లను ముఖంలోకి దించి.. ఈడ్చుకెళ్లింది..
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని ప్రముఖ క్రూగర్ జాతీయ పార్కులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు విహారయాత్రకు వచ్చిన ఓ బాలుడిపై హైనా దాడి చేసింది. దీంతో అతని ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం ఓ కుటుంబం విహారయాత్రకు పార్కుకు వచ్చింది. మధ్యహ్న సమయంలో యాత్రికుల విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన టెంట్లలోకి అందరూ వెళ్లారు. ఎండకు అలసిపోయిన బాలుడు తన టెంటును మూసివేయకుండా ఆదమరచి నిద్రపోయాడు. జంతువులు ప్రవేశించడానికి లేకుండా ఏర్పాటు చేసిన కంచెలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఓ హైనా క్యాంప్ స్థలంలోకి ప్రవేశించింది. బాలుడు నిద్రిస్తున్న గుడారం పూర్తిగా మూసి ఉండకపోవడంతో లోపలికి ప్రవేశించింది. అతనిపై దాడి చేసిన హైనా, దాని ముందరి పళ్లతో బాలుడి ముఖంపై తీవ్రంగా దాడి చేసి బయటకు ఈడ్చుక్కెళ్లసాగింది. ఈ సమయంలో బాలుడు బాధతో పెద్దగా కేకలు వేయడంతో ఉలిక్కిపడిన అతని కుటుంబసభ్యులు హైనా బారి నుంచి అతన్ని కాపాడారు. పార్కు గైడ్, నర్సు ఘటనాస్థలంలో అందుబాటులో ఉండటంతో ప్రాధమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. కాగా, గత ఏడాది జులైలో టూరిస్ట్ గైడ్ పై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. -
జూలో హైనాల సందడి
విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కుకు శనివారం జత హైనాలు(దుమ్మలగుండిలు) వచ్చాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జూ పార్కు నుంచి జత హైనాలను ఇక్కడికి జూ అధికారులు తీసుకొచ్చారు. ఒకటిన్నర సంవత్సరాల వయసు గల స్వాతి అనే ఆడ హైనా, రెండేళ్ల వయసు గల సామ్రాజ్ అనే మగ హైనా ఇక్కడికి చేరుకున్నాయి. వాటికి బదులు ఇక్కడ నుంచి సావిత్రి అనే పేరుగల ఒక ఆడ తెల్లపులిని కాన్పూర్ జూకి పంపించారు. ఈ హైనాలను తీసుకొని కాన్పూర్ జూ డాక్టర్ ఆర్.కె.సింగ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ జంతువులు, ఎన్క్లోజర్లు, వాటి ఆహారం తదితర వాటిని పరిశీలించారు. ఈ నెల 25న కాన్పూర్‌లో బయల్దేరి హైనాలను లారీలో ఇక్కడికి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వాటికి ఒక్కోదానికి చికెన్, మటన్, బీఫ్ రోజుకు సుమారు 4 కిలోల చొప్పున ఆహారంగా ఇస్తున్నామన్నారు. ఇవి ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పారు. ఇవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన అనంతరం వారం రోజుల్లో సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడిచి పెడతామని క్యూరేటర్ జి.రామలింగం తెలిపారు. ప్రయాణంలో మగ హైనా కాలికి స్వల్ప గాయమైందని, దానికి జూ వైద్యుడు శ్రీనివాస్ వైద్యం అందిస్తున్నారన్నారు. -
హైనాను కొట్టి చంపిన 'అనంత' వాసులు
పుట్టపర్తి: అనంతపురం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అడవి జంతువు హైనాను స్థానికులు కొట్టి చంపారు. పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల్లో 25 మందిపై దాడి చేసి గాయపరిచిన హైనాను పట్టుకుని కొట్టి చంపారు. పొలానికి వెళ్లిన పలువురు రైతులపై హైనా దాడి చేసింది. హైనా దాడిలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే రైతులపై దాడిచేసింది చిరుతపులి అని ముందు అనుకున్నారు. చివరకు హైనాగా గుర్తించి పట్టుకున్నారు. హైనాను కొట్టి చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.