యాసలు వేరైనా తెలుగువారంతా ఒకటే
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఏ యాసలో మాట్లాడినా తెలుగు వాళ్లందరూ ఒకటేనని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. భాష ఔన్నత్యాన్ని కాపాడేందుకు ప్రాంతాలకు అతీతంగా తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడి ఏపీభవన్‌లోని గురజాడ హాల్‌లో ఆదివారం గురజాడ అప్పారావు నాటకం కన్యాశుల్కంపై చర్చా గోష్ఠిలో ముఖ్యఅతిథిగా యార్లగడ్డ పాల్గొన్నారు.
కన్యాశుల్కంలో మంచి, చెడులను గురజాడ చర్చించారని, ప్రాచీనం నుంచి ఆధునికంవైపు పయనమవుతున్న సమయంలో తెలుగు సాహిత్యంలో వచ్చిన తొలి సాహిత్య రచన కన్యాశుల్కమన్నారు. కన్యాశుల్కంలోని మాండలిక భాషను ప్రస్తావిస్తూ తెలుగువారి యాస గురించి మాట్లాడారు.
ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు మాట్లాడుతూ.. కన్యాశుల్కం లేనప్పటికీ నాటి దురాచారాలు, ఛాందస భావాలు, సామాజిక రాజకీయ న్యాయవ్యవస్థలో కుళ్లు, కుతంత్రాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఏపీభవన్ సమాచార అధికారి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, సాహిత్యవేదికగా భవన్‌కు ఉండే పూర్వవైభవాన్ని తీసుకొస్తామన్నారు. కన్యాశుల్కం పాత్రల తీరుతెన్నులను, ముఖ్య ఘట్టాలను రంగస్థల కళాకారుడు జోగారావు పంతులు అభినయించారు.