నెల్లూరు, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియపై ఒక్కఅడుగు ముందుకు వేసినా నిరవధిక సమ్మెకు దిగుతామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు సాయిబాబా హెచ్చరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట రహదారిపై శనివారం వంటా,వార్పు నిర్వహించారు. అనంతరం గంగిరెద్దులతో కలసి ఆటపాటలతో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ‘అక్కా అక్కా పనబాక అక్కా, రోశయ్య తాతా’ అంటూ సీమాంధ్ర మంత్రులు, ఎంపీలపై పాడిన పాట అందరినీ ఉత్సాహపరచింది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మెకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కేవలం 72 గంటల సమ్మెకే రాష్ట్రం అంధకారంగా మారిం దని, ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించు కోవాలని చెప్పారు. ఈ నెల 16, 17 తేదీల్లో సీమాంధ్ర జిల్లాల జేఏసీలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాయని వెల్లడించారు. నిరవధిక సమ్మెలో కాంట్రాక్ట్ ఉద్యోగులను భాగస్వాములు చేస్తామన్నారు. సిమ్‌కార్డులను వెనక్కి తీసుకోనున్నట్టు చెప్పారు.