ప్రేమ ఉంటేనే దత్తత
- అనాథలపై చూపాల్సింది జాలికాదు
- హోం స్టడీ రిపోర్టే కీలకం
- జిల్లాలో రెండు శిశు గృహాలు
విజయవాడ సెంట్రల్ : ఇటీవల కృష్ణలంక బాలాజీనగర్ వద్ద పాలిథిన్ కవర్లో చుట్టి డంపర్‌బిన్ వద్ద పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉన్న ఈ బిడ్డను దత్తత తీసుకొనేందుకు ఇరవై మందికి పైగానే పోటీ పడుతున్నారు. ఇలాంటి మరెందరో అనాథలను దత్తత తీసుకుంటామంటూ ఐసీడీఎస్‌కు దరఖాస్తులు అనేకం వస్తున్నాయి. దత్తత తీసుకొనేవారికి ఉండాల్సింది జాలి కాదు, ప్రేమ అని నిబంధనలు చెబుతున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గన్నవరం మండలం బుద్ధవరం వద్ద కేర్ అండ్ షేర్, మచిలీపట్నంలో శిశు గృహాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రస్తుతం 16 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులను దత్తత తీసుకోవాలంటే హోం స్టడీరిపోర్టే కీలకం.
హోం స్టడీ ఇలా..
అనాథలను దత్తత తీసుకోవాలనుకొనేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బిడ్డను ఎందుకు కావాలనుకుంటున్నారనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలి. భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉన్నారనే డాక్టర్ సర్టిఫికెట్, ఎలాంటి కేసులు లేవని పోలీసుల నుంచి ధ్రువీకరణ పత్రం, ఏడాదికి రూ.72 వేల ఆదాయం వస్తున్నట్లు రెవెన్యూ అధికారుల నుంచి పొందిన ఆదాయం సర్టిఫికెట్లను దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది. ఇలా అందిన దరఖాస్తులను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డెరైక్టర్ సంబంధిత సీడీపీవోలకు పంపుతారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారునికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరి స్తారు.
దీన్నే హోంస్టడీ రిపోర్ట్ అంటారు. దరఖాస్తులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలని తేలితేనే దత్తతకు అర్హులుగా పరిగణిస్తారు. ఆర్థిక స్థోమత, కుటుంబ నేపథ్యానికి ప్రాధాన్యత ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరం లోపు, ఏడాది నుంచి మూడేళ్ల లోపు చిన్నారులను రెండు కేటగిరీలుగా విభజించి దత్తత ఇస్తుంటారు. ఏ వయసు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారనే అంశాన్ని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
ప్రేమ చూపాలి
అనాథ బిడ్డలపై ప్రేమ ఉన్న వారికే దత్తత ఇస్తామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ అధికారి కృష్ణకుమారి ‘సాక్షి’కి చెప్పారు. అనాథలపై జాలి చూపిస్తూ ఆదుకుంటామని కొందరు వస్తుంటారన్నారు. ఇలాంటి వారికి ప్రాథాన్యత ఇవ్వమన్నారు. పసిబిడ్డ రావడం వల్ల జీవితంలోకి వెలుగు వస్తోందని ఎవరు ఆతృతపడుతుంటారో వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు.