సాక్షి ప్రతినిధి, కడప: నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయనో రిటైర్డ్ పోలీసు అధికారి. విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించారు. పోలీసు సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీసు మెడల్ సాధించారు. పదవీ విరమణ చేసి కడప నగరం మారుతీనగర్‌లో నివాసముంటున్నారు. ఆయన ఇంట్లో ఉన్న పోలీసు పతకాలతోపాటు రూ.4.5 లక్షల విలువగల బంగారు, వెండి వస్తువులు 2012 అక్టోబర్ 19న చోరీ అయ్యాయి. కడప ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో క్రైం నంబర్ 259/2012 కేసు నమోదైంది. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకుండా విచారణలో ఉంది.
రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 2013 సెప్టెంబర్ 10న దొంగలు పడ్డారు. సుమారు కోటి విలువైన బంగారు, నగదు ఎత్తుకెళ్లారు. క్రైం నంబర్ 161/2013గా కేసు నమోదైంది. ఇప్పటికీ విచారణలో ఉంది. పెపైచ్చు దోపిడీకి గురైన మొత్తం అంతా పోలీసులు కేసులో పొందుపర్చలేదు.
ఈ రెండు ఘటనలు జిల్లాలో పోలీసు అధికారుల విచారణ తీరుకు ఉదాహరణలు మాత్రమే. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం పోలీసు వ్యవస్థ పనితీరును పరిశీలిస్తే ఒక చోరీ జరిగితే దానిని ఛేదించే వరకు పోలీసులు విశ్రమించేవారు కాదు. ఛాలెంజ్‌గా తీసుకొని నిందితులను పట్టుకునే వారు. ప్రస్తుతం పోలీసు అధికారుల్లో ఆ స్ఫూర్తి కనిపించడం లేదు. అసాంఘిక శక్తులను ప్రోత్సహించడంలో జిల్లాలో చిన్నబాస్‌లు ముందుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఈజీమనీ కోసం పోలీసు ప్రతిష్టను కొంతమంది తాకట్టు పెడుతున్నారు. ప్రజా శ్రేయస్సుకంటే ఆదాయం లభించే పోలీసుస్టేషన్‌లో పోస్టింగ్ కోసం యాచిస్తున్నారు.
అందుకు లక్షలాది రూపాయలను సైతం మంచినీళ్ల ప్రాయంగా ముట్టజెప్పుతున్నారు. ఈ క్రమంలో విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలని, చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వర్తించాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లతో చెలిమి చేసి ఈజీ మనీ కోసం అర్రులుచాచిన పోలీసు అధికారులు తెరపైకి వచ్చారు. జైల్లో ఉన్న దొంగను కోర్టుకు తరలిస్తూ దొంగతనాలు చేయించిన ఘనత సైతం జిల్లా పోలీసులకు దక్కింది. కిడ్నాపర్ సునీల్ ముఠాతో సత్సంబంధాలు పెట్టుకున్న తొమ్మిది మంది అధికారులపై వేటు పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగాన్ని గాడిలో పెట్టే బాధ్యతను ఎవరు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు చేయూత..!
జిల్లాలో క్రికెట్ బెట్టింగ్స్, మట్కా కంపెనీలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వీటి వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు పోలీసు అధికారులు, త్రిబుల్‌స్టార్ బాస్‌లు, ఐడీ పార్టీ బృందాల ప్రమేయం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీటిని కొందరు ఉన్నతాధికారులు కట్టడి చేయాలనే తపనతో ఉన్నప్పటికీ కిందిస్థాయి యంత్రాంగం సహకారం లభించకపోవడంతో ఫుల్‌స్టాప్ పెట్టలేకున్నారని తెలుస్తోంది. ఆకస్మిక దాడులు సైతం అసాంఘిక శక్తులకు క్షణాల్లో తెలిసిపోవడమే ఇందుకు ఉదాహరణ అని పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఇప్పటికీ మట్కా, గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు అధిక వడ్డీలకు కొందరు పోలీసు అధికారులే డబ్బులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వారి నుంచి పూచీకత్తుగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఆదాయమే అసలు లక్ష్యం...
జిల్లాలో కొందరు పోలీసు అధికారులకు ప్రకృతి సంపద సైతం అక్రమ ఆదాయవనరుగా మారింది. ఇటీవల ఇసుక, ఎర్రచందనం విషయంలో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తుండటంతో ప్రస్తుతం సెటిల్‌మెంట్లు చేసుకుంటా బిజీగా ఉన్నా రు. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బుంటేనే పోలీసుస్టేషన్‌కు వెళ్లాలనే విధంగా పోలీసు అధికారుల పనితీరు ఉందనే విమర్శలు వినవస్తున్నాయి.
సివిల్ కేసుల్లో సైతం ఉన్నతాధికారులకు పిటిషన్ పెట్టించడం, దాని ఆధారంగా దండుకోవడం రివాజుగా మారింది. సివిల్ కేసుల్లో తలదూర్చమంటూ బోర్డులు పెట్టుకున్న చోటే యథేచ్ఛగా పంచాయితీలు నడుస్తున్నాయి. అక్రమార్జనకోసం అర్రులు చాస్తున్న పోలీసు అధికారులను నియంత్రించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలక్ష్యం..!
Published Mon, Feb 9 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM
Advertisement
Advertisement