Retired police
-
రెండున్నరేళ్లు మానసిక వేదనకు గురయ్యా!
సాక్షి, కరీంనగర్ : హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తాను పనిచేసి, బదిలీ అయిన తర్వాత రెండు తుపాకులు పోతే కేసు పెట్టి, దర్యాప్తు చేయకుండా వాటిని గన్‌మెన్‌తో కలిసి తానే తీసుకెళ్లినట్లు దుష్ప్రచారం చేయడంతో రెండున్నరేళ్లు మానసిక వేదనకు గురయ్యానని రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య తెలిపారు. ముకరంపురలోని ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్క బుల్లెట్ పోతేనే ఎంతో సీరియస్‌గా వ్యవహరించే పోలీసు ఉన్నతాధికారులు, రెండు తుపాకులు పోతే ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. తుపాకులు పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా అప్పటి సీపీ శివకుమార్ నాపై ఉన్న కోపంతో టెక్నికల్‌గా కేసు పెట్టారని ఆరోపించారు. వ్యక్తిగత కక్షకు పోకుండా కేసు దర్యాప్తు చేసి ఉంటే తుపాకులు ఏనాడో దొరికేవన్నారు. తుపాకులు పోయిన ఘటనకు అప్పటి ఎస్‌హెచ్‌వోనే పూర్తి బాధ్యుడని పేర్కొన్నారు. సదానందం కాల్పులు జరపకపోయి ఉంటే ఇంకా పదేళ్లయినా తుపాకులు తీసుకెళ్లిన ఆరోపణల్ని ఎదుర్కొనేవాడినని చెప్పారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ చేపట్టి, నిజాలు తేటతెల్లం చేయాలన్నారు. కాల్పులు జరిపిన సదానందానికి అతని భార్యతో గొడవలుండేవని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రతీసారి తుపాకులు కావాలని అడుగుతున్నట్లు ఠాణా సిబ్బంది నాతో చెప్పేవారన్నారు. ఈ కేసులో దర్యాప్తు ఆఫీసర్లుగా ఉన్న సీపీ జోయల్‌డేవిస్, ఏసీపీ పరమేశ్వర్లు మంచి ఆఫీసర్లని త్వరలోనే వారి విచారణలో నిజాలు తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘కుక్కను కొట్టినట్లు కొట్టాను.. చచ్చాడు’
ముంబై: మాజీ డీసీపీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవ్వడమే కాక.. పోలీసు కస్టడీలో సంభవించే మరణాల గురించి తాజాగా మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది. ముంబై మాజీ డీసీపీ భీమ్రావ్ సోనావనేకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో భీమ్రావ్ 1990 కాలంలో వర్లీ పోలీస్ స్టేషన్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. రట్టు గోసావి అనే ముద్దాయిని ఎలా హింసించింది.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి సోనావనే వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. ‘1990 సంవత్సరం అప్పుడు నేను వర్లీ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాను. రట్టు గోసావి అనే నేరస్తుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. అతడి మీద అప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు రట్టు పోలీసులకు చిక్కాడు. అప్పుడు స్టేషన్లో నేనే ఉన్నాను. మా కస్టడీలో ఉన్న రట్టును శారీరకంగా చాలా హింసించాను. అతడి వ్యక్తిగత శరీర భాగాలతో సహా దేహంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. సరిగా చెప్పలంటే కుక్కను కొట్టినట్లు కొట్టాను. దాంతో అతడు మరణించాడు. వెంటనే ఈ విషయం గురించి నా పై అధికారులకు తెలియజేశాను. ఈ లోపు పోలీస్ స్టేషన్ బయట గందరగోళం ప్రారంభమయ్యింది’ అన్నాడు సోనావనే. ‘దాదాపు 400 మంది పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వారి ఎదురుగా రట్టు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడం కష్టం. ఎలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఉపాయం తట్టింది. స్టేషన్ బయట ఓ వాహనాన్ని సిద్ధం చేసి ఉంచాను. రట్టు చేతికి బేడీలు వేశాను. ఇద్దరు కానిస్టేబుళ్ల సాయంతో రట్టును బయటకు నడిపించుకుంటూ తీసుకెళ్లాం. చూసే వారికి అతడు గాయంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. రట్టు గురించి అడిగిన వారికి ‘తనను తాను గాయపర్చుకున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. గాయం కారణంగా నడవలేకపోతున్నాడు’ అని చెప్పాం. చేతికి బేడీలు ఉండటంతో మేం చెప్పింది నిజమని నమ్మారు. ఆ తర్వాత అతడిని కేఈఎం ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ వారు రట్టు మృత దేహాన్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు’ అన్నాడు సోనావనే. ‘తర్వాత రట్టు బాడీని జేజే ఆస్పత్రిలో చేర్చాం. అతడి చేతిలో తుపాకీ పెట్టాం. రట్టు పోలీసుల మీద కాల్పులుకు పాల్పడ్డాడని.. పారిపోవడానికి ప్రయత్నిస్తూ.. మొదటి అంతస్తు నుంచి దుకాడని.. ఈ క్రమంలో అతడు చనిపోయాడని చెప్పాం. దాని ప్రకారం ఆ తర్వాత స్టేషన్ డైరీలో కూడా మార్పులు చేశాం’ అంటూ సోనావనే చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా సోనావనే బంధువు, వ్యాపారవేత్త రాజేంద్ర ఠక్కర్ ఆఫీస్‌లో చోటు చేసుకుంది. దాంతో సోనావనే చెప్పినవన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఈ వీడియో తీసుకెళ్లి ముంబై పోలీసులకు ఇచ్చి, సోనావనే మీద ఫిర్యాదు చేసింది రాజేంద్ర ఠక్కర్ కావడం ఇక్కడ అసలు ట్విస్ట్. డబ్బుల విషయంలో ఠక్కర్‌కు, సోనావనేకు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. దాంతో ఇదే అదునుగా భావించిన ఠక్కర్ ఈ వీడియో ఫుటేజ్‌ను వర్లీ పోలీసులకు అందజేశాడు. అంతేకాక వీడియో ఆధారంగా సోనావనే మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బాంబే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఠక్కర్ వ్యాఖ్యలను సోనావనే ఖండిస్తున్నాడు. తనపై చేసినవన్ని నిరాధారమైన ఆరోపణలని.. వ్యక్తిగత వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఠక్కర్ నకిలీ వీడియో రూపొందించి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని సోనావనే పేర్కొన్నాడు. ఇక ఈ విషయం గురించి ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. ‘ఈ ఘటన జరిగినప్పుడే దీని గురించి విచారణ చేశాము. ప్రస్తుతం మళ్లీ కొత్తగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మరో సారి విచారణ చేస్తాం. అలా చేయాలంటే ఈ వీడియో మాత్రమే సరిపోదు.. మరికొన్ని బలమైన సాక్ష్యాలు కావాలి’ అంటూ చెప్పుకొచ్చారు. -
కుళ్లిన కూతురి శవంతో నెలరోజుల పాటు..
మిర్జాపూర్ : శవం పక్కన కొద్దిసేపు ఉండడానికే భయపడతారు చాలా మంది. కానీ చనిపోయిన వ్యక్తి శవం పక్కన నెల రోజుల పాటు ఉండాల్సి వస్తే ? అది కూడా సొంత కూతురి శవమైతే? ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ. కానీ ఓ దంపతులు తమ కూతురి శవాన్ని ఇంట్లో పెట్టుకొని నెల రోజుల పాటు ఉన్నారు. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. యూపీకి చెందిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారి, అతని భార్య మిర్జాపూర్‌లోని హయత్‌నగర్‌లో ఏరియాలో ‘దిలావర్ సిద్దిఖీ’ హౌజ్‌లో నివాసం ఉంటున్నారు. అతనికి ఓ కూతురు ఉంది. గత కొద్ది రోజులుగా ఆ ఇంటి నుంచి ఏదో దుర్వాసన వస్తోంది. ఆ దుర్వాసన రోజురోజుకి ఎక్కువవుతుండడంతో భరించలేక చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హయత్‌నగర్ చేరుకొని రిటైర్డ్ పోలీసు అధికారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో నుంచి కుళ్లిపోయిన ఒక శవం లభించింది. ఆ శవాన్ని రిటైర్డ్ పోలీసు అధికారి కూతురిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ఆ దంపతులను విచారించగా.. తమ కూతురు చనిపోలేదని, నిద్రపోతుందని సమాధానం చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. అంతే కాకుండా తామంతా కలిసే ఉన్నామని, తమ ఇంట్లో ఎలాంటి దుర్వాసన రావడం లేదని పిచ్చి పిచ్చి సమాధానాలు ఇచ్చారు. వారి సమాధానాలపై అనుమానం వచ్చి ఈ విషయంపై చుట్టుపక్కలవారిని ప్రశ్నించగా..ఆ దంపతులు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, ఎవరితో సరిగా మాట్లాడేవారు కాదని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి తరలించారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న దంపతులు అనుకోకుండా తమ కూతురిని హత్య చేసి ఉండవచ్చని, పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. -
రిటైర్డ్ పోలీసులకు బోధకులుగా అవకాశం
– జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు: ఆసక్తి ఉన్న రిటైర్డ్ పోలీసులు.. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో తరగతులు బోధించవచ్చని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. జిల్లాలో ఎనిమిది మంది పోలీసు అధికారులు బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంట ర్లో ఎస్పీ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో ‘మన కుటంబం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐలు పి.జాన్ (నందికొట్కూరు), పి.పుల్లయ్య (నంద్యాల ట్రాఫిక్), కె.విశ్వనాథ్ (ఆదోని ట్రాఫిక్), అబ్దుల్‌హక్ (నంద్యాల ట్రాఫిక్), ఏఎస్ఐలు డీఎల్ దస్తగిరి (ఉలిందకొండ పీఎస్), సి.ప్రసాదరావు (డీసీఆర్బీ), కేవీ సుబ్బయ్య (కర్నూలు పీసీఆర్), ఆర్ఎస్ఐ ఎస్ మహమూద్ (ఏఆర్ హెడ్ క్వాటర్స్) తదితరులు పదవీవిరమణ పొందారు. వీరందరినీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పిలిపించి శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి సూట్‌కేసులను బహుమతులుగా అందజేశారు. అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ దంపతులు అల్పాహారం వడ్డించారు. ఎస్పీ రవికృష్ణతో పాటు తల్లి ఆకె రత్నమాల, సతీమణి ఆకె పార్వతి, అడిషనల్ ఎస్పీ షేక్షావలీ, డీఎస్పీ రమణమూర్తి, ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు ములకన్న, నాగరాజు యాదవ్, డేగల ప్రభాకర్, దివాకర్‌రెడ్డి, ఆదిలక్ష్మీ, ఆర్ఐలు రంగముని, జార్జ్, రామకృష్ణ, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం చేసే అదృష్టం పోలీసులదే
ఏలూరు అర్బన్ : సమాజంలో ప్రతి వ్యక్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడే అవకాశం పోలీసులకు మాత్రమే లభించే గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ అన్నారు. ఆదివారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు.ఒత్తిళ్ల మధ్య విధి నిర్వహణలో పోలీసు ఉద్యోగం నిజమైన కత్తిసాము అని ఎస్పీ అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఎస్సైలు పి.పోతురాజు, పీవీవీ కుమార్, కె.నాగేశ్వరరావు, జి.లీలావతి, పి.రాజు, హెచ్‌సీ కేవీఆర్.కృష్ణ, కానిస్టేబుళ్లు బి.సత్యనారాయణ, ఎండీఎస్ గోరి, ఎస్వీ.ప్రసాద్, డీఎస్.నారాయణలకు శుభాకాంక్షలందించారు. ఏలూరు డీఎస్పీ, గోగుల వెంకటేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ, పి.భాస్కరరావు,సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. -
అలక్ష్యం..!
సాక్షి ప్రతినిధి, కడప: నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆయనో రిటైర్డ్ పోలీసు అధికారి. విధినిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించారు. పోలీసు సేవా పతకం, ఉత్తమ సేవా పతకం, ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీసు మెడల్ సాధించారు. పదవీ విరమణ చేసి కడప నగరం మారుతీనగర్‌లో నివాసముంటున్నారు. ఆయన ఇంట్లో ఉన్న పోలీసు పతకాలతోపాటు రూ.4.5 లక్షల విలువగల బంగారు, వెండి వస్తువులు 2012 అక్టోబర్ 19న చోరీ అయ్యాయి. కడప ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో క్రైం నంబర్ 259/2012 కేసు నమోదైంది. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకుండా విచారణలో ఉంది. రాజంపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 2013 సెప్టెంబర్ 10న దొంగలు పడ్డారు. సుమారు కోటి విలువైన బంగారు, నగదు ఎత్తుకెళ్లారు. క్రైం నంబర్ 161/2013గా కేసు నమోదైంది. ఇప్పటికీ విచారణలో ఉంది. పెపైచ్చు దోపిడీకి గురైన మొత్తం అంతా పోలీసులు కేసులో పొందుపర్చలేదు. ఈ రెండు ఘటనలు జిల్లాలో పోలీసు అధికారుల విచారణ తీరుకు ఉదాహరణలు మాత్రమే. ఈ నేపథ్యంలో పదేళ్ల క్రితం పోలీసు వ్యవస్థ పనితీరును పరిశీలిస్తే ఒక చోరీ జరిగితే దానిని ఛేదించే వరకు పోలీసులు విశ్రమించేవారు కాదు. ఛాలెంజ్‌గా తీసుకొని నిందితులను పట్టుకునే వారు. ప్రస్తుతం పోలీసు అధికారుల్లో ఆ స్ఫూర్తి కనిపించడం లేదు. అసాంఘిక శక్తులను ప్రోత్సహించడంలో జిల్లాలో చిన్నబాస్‌లు ముందుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఈజీమనీ కోసం పోలీసు ప్రతిష్టను కొంతమంది తాకట్టు పెడుతున్నారు. ప్రజా శ్రేయస్సుకంటే ఆదాయం లభించే పోలీసుస్టేషన్లో పోస్టింగ్ కోసం యాచిస్తున్నారు. అందుకు లక్షలాది రూపాయలను సైతం మంచినీళ్ల ప్రాయంగా ముట్టజెప్పుతున్నారు. ఈ క్రమంలో విధినిర్వహణలో నిక్కచ్చిగా ఉండాలని, చట్టానికి లోబడి బాధ్యతలు నిర్వర్తించాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లతో చెలిమి చేసి ఈజీ మనీ కోసం అర్రులుచాచిన పోలీసు అధికారులు తెరపైకి వచ్చారు. జైల్లో ఉన్న దొంగను కోర్టుకు తరలిస్తూ దొంగతనాలు చేయించిన ఘనత సైతం జిల్లా పోలీసులకు దక్కింది. కిడ్నాపర్ సునీల్ ముఠాతో సత్సంబంధాలు పెట్టుకున్న తొమ్మిది మంది అధికారులపై వేటు పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగాన్ని గాడిలో పెట్టే బాధ్యతను ఎవరు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు చేయూత..! జిల్లాలో క్రికెట్ బెట్టింగ్స్, మట్కా కంపెనీలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వీటి వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరు పోలీసు అధికారులు, త్రిబుల్‌స్టార్ బాస్‌లు, ఐడీ పార్టీ బృందాల ప్రమేయం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీటిని కొందరు ఉన్నతాధికారులు కట్టడి చేయాలనే తపనతో ఉన్నప్పటికీ కిందిస్థాయి యంత్రాంగం సహకారం లభించకపోవడంతో ఫుల్స్టాప్ పెట్టలేకున్నారని తెలుస్తోంది. ఆకస్మిక దాడులు సైతం అసాంఘిక శక్తులకు క్షణాల్లో తెలిసిపోవడమే ఇందుకు ఉదాహరణ అని పోలీసు వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఇప్పటికీ మట్కా, గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు అధిక వడ్డీలకు కొందరు పోలీసు అధికారులే డబ్బులు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వారి నుంచి పూచీకత్తుగా ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయమే అసలు లక్ష్యం... జిల్లాలో కొందరు పోలీసు అధికారులకు ప్రకృతి సంపద సైతం అక్రమ ఆదాయవనరుగా మారింది. ఇటీవల ఇసుక, ఎర్రచందనం విషయంలో ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తుండటంతో ప్రస్తుతం సెటిల్మెంట్లు చేసుకుంటా బిజీగా ఉన్నా రు. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బుంటేనే పోలీసుస్టేషన్‌కు వెళ్లాలనే విధంగా పోలీసు అధికారుల పనితీరు ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. సివిల్ కేసుల్లో సైతం ఉన్నతాధికారులకు పిటిషన్ పెట్టించడం, దాని ఆధారంగా దండుకోవడం రివాజుగా మారింది. సివిల్ కేసుల్లో తలదూర్చమంటూ బోర్డులు పెట్టుకున్న చోటే యథేచ్ఛగా పంచాయితీలు నడుస్తున్నాయి. అక్రమార్జనకోసం అర్రులు చాస్తున్న పోలీసు అధికారులను నియంత్రించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.