‘కుక్కను కొట్టినట్లు కొట్టాను.. చచ్చాడు’ | Mumbai Ex Cop Explains Custodial Death After 30 Years | Sakshi
Sakshi News home page

కలకలం రేపుతున్న మాజీ డీసీపీ వ్యాఖ్యలు

Published Fri, Aug 9 2019 4:03 PM | Last Updated on Fri, Aug 9 2019 4:17 PM

Mumbai Ex Cop Explains Custodial Death After 30 Years - Sakshi

ముంబై: మాజీ డీసీపీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవ్వడమే కాక.. పోలీసు కస్టడీలో సంభవించే మరణాల గురించి తాజాగా మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది. ముంబై మాజీ డీసీపీ భీమ్రావ్‌ సోనావనేకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపుతోంది. ఈ వీడియోలో భీమ్రావ్‌ 1990 కాలంలో వర్లీ పోలీస్‌ స్టేషన్‌లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. రట్టు గోసావి అనే ముద్దాయిని ఎలా హింసించింది.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి  సోనావనే వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఆ వివరాలు అతడి మాటల్లోనే.. ‘1990 సంవత్సరం అప్పుడు నేను వర్లీ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాను. రట్టు గోసావి అనే నేరస్తుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం. అతడి మీద అప్పటికే 27 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ రోజు రట్టు పోలీసులకు చిక్కాడు. అప్పుడు స్టేషన్‌లో నేనే ఉన్నాను. మా కస్టడీలో ఉన్న రట్టును శారీరకంగా చాలా హింసించాను. అతడి వ్యక్తిగత శరీర భాగాలతో సహా దేహంలో ఏ భాగాన్ని విడిచిపెట్టలేదు. సరిగా చెప్పలంటే కుక్కను కొట్టినట్లు కొట్టాను. దాంతో అతడు మరణించాడు. వెంటనే ఈ విషయం గురించి నా పై అధికారులకు తెలియజేశాను. ఈ లోపు పోలీస్‌ స్టేషన్‌ బయట గందరగోళం ప్రారంభమయ్యింది’ అన్నాడు సోనావనే.

‘దాదాపు 400 మంది పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేస్తున్నారు. వారి ఎదురుగా రట్టు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడం కష్టం. ఎలా అని ఆలోచిస్తుండగా.. ఓ ఉపాయం తట్టింది. స్టేషన్‌ బయట ఓ వాహనాన్ని సిద్ధం చేసి ఉంచాను. రట్టు చేతికి బేడీలు వేశాను. ఇద్దరు కానిస్టేబుళ్ల సాయంతో రట్టును బయటకు నడిపించుకుంటూ తీసుకెళ్లాం. చూసే వారికి అతడు గాయంతో నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది. రట్టు గురించి అడిగిన వారికి ‘తనను తాను గాయపర్చుకున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. గాయం కారణంగా నడవలేకపోతున్నాడు’ అని చెప్పాం. చేతికి బేడీలు ఉండటంతో మేం చెప్పింది నిజమని నమ్మారు. ఆ తర్వాత అతడిని కేఈఎం ఆస్పత్రికి తీసుకెళ్లాం. కానీ వారు రట్టు మృత దేహాన్ని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించలేదు’ అన్నాడు సోనావనే.

‘తర్వాత రట్టు బాడీని జేజే ఆస్పత్రిలో చేర్చాం. అతడి చేతిలో తుపాకీ పెట్టాం. రట్టు పోలీసుల మీద కాల్పులుకు పాల్పడ్డాడని.. పారిపోవడానికి ప్రయత్నిస్తూ.. మొదటి అంతస్తు నుంచి దుకాడని.. ఈ క్రమంలో అతడు చనిపోయాడని చెప్పాం. దాని ప్రకారం ఆ తర్వాత స్టేషన్‌ డైరీలో కూడా మార్పులు చేశాం’ అంటూ సోనావనే చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా సోనావనే బంధువు, వ్యాపారవేత్త రాజేంద్ర ఠక్కర్‌ ఆఫీస్‌లో చోటు చేసుకుంది. దాంతో సోనావనే చెప్పినవన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఈ వీడియో తీసుకెళ్లి ముంబై పోలీసులకు ఇచ్చి, సోనావనే మీద ఫిర్యాదు చేసింది రాజేంద్ర ఠక్కర్‌ కావడం ఇక్కడ అసలు ట్విస్ట్‌. డబ్బుల విషయంలో ఠక్కర్‌కు, సోనావనేకు మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. దాంతో ఇదే అదునుగా భావించిన ఠక్కర్‌ ఈ వీడియో ఫుటేజ్‌ను వర్లీ పోలీసులకు అందజేశాడు.

అంతేకాక వీడియో ఆధారంగా సోనావనే మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా బాంబే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే ఠక్కర్‌ వ్యాఖ్యలను సోనావనే ఖండిస్తున్నాడు. తనపై చేసినవన్ని నిరాధారమైన ఆరోపణలని.. వ్యక్తిగత వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఠక్కర్‌ నకిలీ వీడియో రూపొందించి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని సోనావనే పేర్కొన్నాడు. ఇక ఈ విషయం గురించి ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. ‘ఈ ఘటన జరిగినప్పుడే దీని గురించి విచారణ చేశాము. ప్రస్తుతం మళ్లీ కొత్తగా ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మరో సారి విచారణ చేస్తాం. అలా చేయాలంటే ఈ వీడియో మాత్రమే సరిపోదు.. మరికొన్ని బలమైన సాక్ష్యాలు కావాలి’ అంటూ చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement