వచ్చే ఏడాది నుంచి.. ఐఐటీ తరగతులు!
బీటెక్‌తో ‘ఏపీ’ ఐఐటీ ప్రారంభం
‘ఐఐటీ-జేఈఈ’ ప్రవేశ పరీక్ష ద్వారా సీట్ల భర్తీ
సలహాదారుగా చెన్నై ఐఐటీ
తాత్కాలిక భవనంపై కేంద్రానికి కలెక్టర్ నివేదిక
భవన పరిశీలనకు త్వరలో కేంద్ర బృందం రాక
తిరుపతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తిరుపతిలో ఐఐటీ తరగతులు ప్రారంభించేందుకు కేంద్ర మానవవనరులశాఖ రంగం సిద్ధం చేసింది. ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సమయం తీసుకునే అవకాశం ఉండటంతో తత్కాలికంగా ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను ఎంపిక చేసి కేంద్రానికి కలెక్టర్ నివేదించారు. కేంద్ర బృందం నెలాఖరులోగానీ.. జనవరి మొదటివారంలోగానీ తిరుపతిలో పర్యటించి భవనాలను పరిశీలించి తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నాయి. వివరాలిలా..
విభజన నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయించిన ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సంస్థను తిరుపతిలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఐఐటీకి ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద 450 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూమిలో శాశ్వత భవనాలను నిర్మించి.. క్యాంపస్‌ను ఏర్పాటుచేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఐఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం 2014-15 బడ్జెట్‌లో రూ.వంద కోట్లను కేటాయించింది. మేర్లపాక వద్ద శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భవన నిర్మాణాలు.. మౌలిక సదుపాయాల కల్పన పనులకు టెండర్లు పిలవడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. శాశ్వత క్యాంపస్ ఏర్పాటు పనులు సమయం తీసుకునే అవకాశం ఉండడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభించడానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ అంశాన్ని నాలుగు రోజుల క్రితం పార్లమెంట్‌లో కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు.
21 సెంచురీ గురుకులంలోనే..
తిరుపతిలో ప్రారంభించే ఐఐటీకి చెన్నై ఐఐటీ సలహాదారుగా వ్యవహరిస్తుందని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలతో కూడిన భవనాలపై నివేదిక పంపాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను కేంద్రం కోరింది. రేణిగుంట సర్కిల్‌కు సమీపంలో ఎయిర్‌పోర్టుకు దగ్గర ఉండే ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల, తిరుపతి శివారులో ఉండే మరో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల.. ఎస్వీ యూనివర్సిటీకి సమీపంలో ఉండే 21 సెంచురీ గురుకులం భవనాలు అనువుగా ఉంటాయని కలెక్టర్ కేంద్రానికి నివేదించారు. ఈ భవనాల పరిశీలన కోసం కేంద్ర బృందం నెలాఖరులోగానీ.. జనవరి మొదటివారంలోగానీ తిరుపతిలో పర్యటిం చనుంది. ప్రభుత్వం నిర్మించిన 21 సెంచురీ గురుకులం భవనంలోనే తాత్కాలిక ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుచేసే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.
బీటెక్‌తో ప్రారంభం..
ఐఐటీల్లో బీటెక్ నుంచి పీహెచ్‌డీ వరకూ కోర్సులు అందిస్తారు. తిరుపతిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే ఐఐటీలో మాత్రం కేవలం బీటెక్(అన్ని విభాగాలు)తో తరగతులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎంటెక్, ఎమ్మెస్సీ(ఇంజినీరింగ్, మాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, జువాలజీ), పీహెచ్‌డీ కోర్సులనూ అందుబాటులోకి తెస్తారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభించే బీటెక్ ఫస్టియర్‌లో 120 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే ‘ఐఐటీ-జేఈఈ’ కామన్ ఎంట్రెన్స్ ద్వారానే సీట్లను భర్తీ చేయనున్నారు. అడ్మిషన్ల దగ్గర నుంచి తరగతుల నిర్వహణ వరకూ అన్ని అంశాల్లోనూ చెన్నై ఐఐటీ తిరుపతి ఐఐటీకి సలహాదారుగా వ్యవహరిస్తుంది.
ఇదిలావుండగా చెన్నై ఐఐటీలో బోధించే ప్రొఫెసర్లలో కొందరు.. తిరుపతి ఐఐటీలోనూ విధులు నిర్వహించనున్నారు. ఓ వైపు తాత్కాలిక క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తూనే శాశ్వత క్యాంపస్ కోసం భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టి సారిస్తుందని అధికారవర్గాలు వెల్లడించాయి.