గుత్తి, న్యూస్‌లైన్ : గుత్తి, గుత్తి ఆర్‌ఎస్‌లో భారీ వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి మంగళవారం ఉదయం ఆరు గంటలకు వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు రాత్రంగా జాగరణ చేయాల్సి వచ్చింది. లోతట్టు కాలనీలన్నీ జలమయం అయ్యాయి. గుత్తి ఆర్‌ఎస్‌లోని కర్నూలు రోడ్డు, ఎస్‌ఎస్ పల్లి కాలనీ, శుద్ధ ఫ్యాక్టరీ కాలనీ, ఎంఆర్ రోడ్డు కాలనీల్లో నీరు ఇళ్లలోకి చేరింది. నిత్యావసర, ఇతర వస్తువులు తడిసిపోయాయి. నీటిని బయటకు తోడేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుత్తి ఆర్‌ఎస్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉన్న షరీఫ్ ఇల్లు కూలిపోయింది. గుత్తి-గుత్తి ఆర్‌ఎస్ ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది.
ఎంపీడీఓ కార్యాలయం, పశు వైద్యశాల, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఫారెస్ట్ కార్యాలయంలోకి వరద నీరు చేరింది. మెయిన్ బజారులోని కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద ఉన్న నాగరాజుకు చెందిన టైలర్ షాపు కూలిపోయింది. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. వక్కల కుంటలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఇంతటి భారీ వర్షాన్ని 20 ఏళ్లలో తామెప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. వరద కాలనీలను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌ను డ్రెయినేజీ సరిగా ఏర్పాటు చేయాలని ఆయా కాలనీవాసులు కోరారు.
జిల్లా వ్యాప్తంగా వర్షాలు : జిల్లా వ్యాప్తంగా మూడ్రోజుల నుంచి వర్షం కురుస్తోంది. చాలా మండలాల్లో 70 నుంచి 100 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది. మంగళవారం అనంతపురం, ఆత్మకూరు, గార్లదిన్నె, రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, కూడేరు, పెద్దవడుగూరు, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో వర్షం కురిసింది. కాగా రాత్రి హిందూపురంలో కుండపోత వర్షం కురిసింది.
గుత్తిలో భారీ వర్షం
Published Wed, Sep 11 2013 4:23 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement