* వైద్యులకు ఆరోగ్యమంత్రి కామినేని హితవు
* జీఎస్‌ఎల్‌లో దంతవైద్య సదస్సు ప్రారంభం
రాజానగరం : వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మార్పులతో రోగులకు మేలైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ, జీఎస్‌ఎల్ డెంటల్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహిస్తున్న థర్డ్ ఏపీ రాష్ట్ర అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ డెంటల్ కాన్ఫరెన్స్‌ని శుక్రవారం రాత్రి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీఎస్‌ఎల్ వైద్య కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ కామినేని మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం తాను వైద్య విద్యను అభ్యసించన నాటికీ, నేటికీ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి సాధించిందన్నారు. నాడు పంటినొప్పి వస్తే పీకేయడమే చికిత్సని, కానీ నేడు పనికి రాని పంటిని కూడా రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ వంటి ఆధునిక ప్రక్రియ ద్వారా పటిష్టం చేస్తున్నారని చెప్పారు. అంతేకాక వైద్య విద్యార్థుల్లో బాలుర కంటే బాలిక ల శాతం ఎక్కువగా ఉండటం హర్షణీయమన్నారు.
పీహెచ్‌సీల్లో దంతవైద్యులు..
స్టేట్ డెంటల్ కౌన్సిల్ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని తెలిపారు. వివిధ దంత వైద్య కళాశాలల ప్రతినిధుల విజ్ఞప్తికి మంత్రి పై విధంగా స్పందించారు. పీహెచ్‌సీలలో దంత వైద్యుని పోస్టు ఉండేలా ప్రయత్నం చేస్తామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారుల పోస్టుల భర్తీలో పూర్తి పారదర్శకతను చూపించామన్నారు. తాము అధికారంలోకి వచ్చే సరికి ఈ వ్యవస్త పూర్తిగా పాడైందని, డీఎంఅండ్‌హెచ్‌ఓలు బాధ్యతగా విధులు నిర్వర్తించే స్తితిలో లేరని అన్నారు. ఆయుష్ బదిలీలలో అవినీతి జరిగిందని గ్రహించి పూర్తిగా నిలిపివేశామన్నారు.
వైద్యులకు ఇబ్బందికరంగా ఉన్న జీఓ : నంబరు 411ను మరో 15 రోజుల్లో రద్దు చేయడం లేదా సవరించడం చేస్తామన్నారు. తమ పదవులు శాశ్వతం కాదని, మీ సేవలే శాశ్వతమంటూ వైద్య విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. మూడు రోజులు జరిగే ఈ సదస్సుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 24 దంత వైద్య కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు హాజరయ్యారు. కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు వి.సూర్యనారాయణరాజు, ఎంసీఐ సభ్యుడు డాక్టర్ గన్ని భాస్కరరావు, స్పందన వాలంటరీ ఆర్గనైజేషన్ చైర్మన్ గన్ని కృష్ణ, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎల్.అమరసింహారెడ్డి
, కార్యదర్శి డాక్టర్ కె.అజయ్‌బెనర్జీ, సదస్సు అధ్యక్షుడు డాక్టర్ పి.కరుణాకర్, కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఘంటా సునీల్, జీఎస్‌ఎల్ కార్యదర్శి డాక్టర్ గన్ని సందీప్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వైవీ శర్మ, దంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కల్పన, సభ్యులు డాక్టర్ బీవీవీ సతీష్, డాక్టర్ సతీష్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ ఎల్.కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రద ర్శించారు.
28ఆర్‌జెసీ166: జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్
28ఆర్‌జెసీ170: విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన
చికిత్సలో ఆధునిక పద్ధతులు అనుసరించండి
Published Sat, Nov 29 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement
Advertisement