పెరగనున్న పోలీస్ బాస్‌లు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మరింత పక్కాగా శాంతిభద్రతల పర్యవేక్షణకు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో జవసత్వాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మారుతున్న కాలంతోపాటు నేరాల స్వరూపం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక నేరాలు, మహిళలపై లైంగిక దాడులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ప్రభుత్వ సంపద అయిన నదుల్లోని ఇసుకను కొల్లగొడుతున్న వారిపై చోరీ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం, ఏడాదిలో మూడు కేసులు నమోదయ్యే వారిపై రౌడీషీట్లు తెరవాలని కూడా నిర్ణయించింది. లైంగిక దాడులను అరికట్టేందుకు నిర్భయ చట్టాన్ని పక్కాగా అమలు చేయడంతోపాటు, అనాథ పిల్లల సంరక్షణ బాధ్యతలను డీఎస్సీ స్థాయి అధికారులు ఉండాలని చెబుతోంది. వరకట్నం, అట్రాసిటీ, గృహహింస తదితర కేసుల్లోనూ ఈ స్థాయి అధికారులనే బాధ్యులను చేస్తోంది. మహిళా
పోలీస్‌స్టేషన్ల సంఖ్య పెంచడంతో పాటు వాటి పర్యవేక్షణకు డీఎస్పీల నే నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు వీలుగా సిబ్బంది పెంపుతో పాటు ఉన్నతాధికారుల పోస్టులను కొత్తగా మంజూరు చేయనున్నారు. ఇవన్నీ అమలైతే శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా ఆరేడు డీఎస్పీ పోస్టులు రావచ్చని అధికారులే చెబుతున్నారు.
ప్రస్తుతం ఇదీ పరిస్థితి
జిల్లాలో ప్రస్తుతం శ్రీకాకుళం, కాశీబుగ్గ, పాలకొండ సబ్ డివిజన్లకు మూడు డీఎస్పీ పోస్టులున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడున్న డీఎస్పీలను తప్పించేందుకు ఆ పార్టీ నాయకులు కొందరు ప్రయత్నిస్తున్నారు. తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పించుకునేందుకు హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ పోస్టు కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. దీంతోపాటు కొత్తగా ట్రాఫిక్, డీసీఆర్‌బీ (జిల్లా క్రైం రికార్డ్స్ బ్యూరో), మహిళా పోలీస్‌స్టేషన్, సోంపేట, పలాస ప్రాంతాలకు, ఎస్పీ ఆధ్వర్యంలో ఉండే ప్రత్యేక ఫోర్స్‌కు (టాస్క్‌ఫోర్స్‌కు బాధ్యత వహించేలా), సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్)కు, అలాగే ఇంటెలిజెన్స్, సీఐడీ విభాగాలకు డీఎస్పీలను నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు ఉన్నతాధికారులకు కూడా నివేదిక పంపించినట్టు తెలిసింది.
పదోన్నతుల్లోనే..
ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మంది డీఎస్పీలను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. గ్రూప్-1 ద్వారా ఎంపికైన పలువురు పోసింగుల కోసం ఎదురుచూస్తుండగా, ప్రమోషన్ల జాబితాలో ఉన్న అనేకమంది సీఐలు కూడా వాటి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. డీపీసీ (డిపార్ట్‌మెంట్ ప్రమోషనల్ కమిటీ) ఆధ్వర్యంలో పదోన్నతుల ప్రక్రియ కూడా ఊపందుకున్నట్టు తెలిసింది. దీంతో అనుకూలమైన చోట పోస్టింగ్‌ల కోసం డీఎస్సీ స్థాయి అధికారులు రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య భారీస్థాయిలో పోస్టింగ్‌లు కేటాయించాల్సి రావడంతో ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది.