విదేశీ భాషలపై పట్టు పెంచుకోవాలి | Increase the grip of foreign languages | Sakshi
Sakshi News home page

విదేశీ భాషలపై పట్టు పెంచుకోవాలి

Published Sun, Mar 15 2015 2:50 AM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM

Increase the grip of foreign languages

రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి
 
నంద్యాల: విద్యార్థులు విదేశీ భాషలపై పట్టుపెంచుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాలలో రిపల్స్-15 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జపాన్, జర్మన్‌తో పాటు మరికొన్ని దేశాలు భారీ ఎత్తున పరిశ్రమలను, ఇతర సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. జపాన్, జర్మన్ భాషలపై పట్టు సాధిస్తే ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుదలతో రాష్ట్రానికి విదేశీ సంస్థలను ఆహ్వానిస్తున్నారన్నారు. ఇందుకు విదేశీ సంస్థలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా 50వేల నుంచి లక్ష వరకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెప్పారు. విదేశీ భాషలను విద్యార్థులకు నేర్పడానికి ఇప్పటి నుంచే కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ప్రణాళికలను రూపొందించామన్నారు. ఎంబీఏ విద్యార్థులకు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
 
విశేష స్పందన..
రామకృష్ణ పీజీ కళాశాలో ఎంబీఏ విద్యార్థులు నిర్వహించిన రిపుల్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని 15 కళాశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు 200మందికి పైగా తమ ప్రతిభను చాటుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏడు విభాగాలను ఏర్పాటు చేసి ప్రతిభా పరీక్షలను నిర్వహించారు. వీటిని పరిశీలించి..పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులను రాష్ట్ర ఉన్న విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి అభినందించారు.

ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ఎంకాంలో ఈ కామర్స్, బీకాంలో మరికొన్ని కొత్త కోర్సులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం వేణుగోపాల్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రతినిధి గడ్డం హేమంత్‌రెడ్డి, డాక్టర్ కళామురళీ, మోహన్‌రావుతో పాటు నిర్వాహకులు రత్నారెడ్డి, ఇంతియాజ్ అహమ్మద్, శ్రావణకుమారి, వెంకటరావు, నాగరాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement