కలగా అంతర్జాతీయ విమానయానం | No Foreign Services In Renigunta Airport Chittoor | Sakshi
Sakshi News home page

కలగా అంతర్జాతీయ విమానయానం

Published Sat, Jul 28 2018 9:12 AM | Last Updated on Sat, Jul 28 2018 9:12 AM

No Foreign Services In Renigunta Airport Chittoor - Sakshi

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం... పేరుకే అంతర్జాతీయం... కనీసం దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు కూడా విమానాలు తిరగని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన టెర్మినల్‌ ఏర్పాటు చేసి మూడేళ్లు దాటుతున్నా విమానాలు భాగ్యనగరాన్ని దాటి బయటకు వెళ్లడంలేదు. ఫలితంగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన వారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

రేణిగుంట: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి సమీపంలోని రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి దివంగత  ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూపకల్పన జరిగింది. 2015లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గరుడ పక్షి ఆకారంలో రూ.175 కోట్లతో నూతన టెర్మినల్‌ను ప్రారంభించారు. టెర్మినల్‌ ప్రాంగణంలో రూ.5కోట్లకు పైగా వెచ్చించి తుడా అధికారులతో సుందరీకరణ పనులు కూడా చేయించారు. 2017 జూన్‌లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక్కడ నుంచి కువైట్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలకు కనెక్టింగ్‌ ఫ్లెట్లను నడుపుతామని మూడు నెలల కిందట సాక్షాత్తూ అప్పటి కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజు ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

గణనీయంగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య..
గతంలో కేవలం హైదరాబాద్‌ నగరానికి మాత్రమే పరిమితమైన విమాన సేవలు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలకు విస్తరించాయి. ఎయిర్‌ ఇండియాతో పాటు స్పైస్‌జెట్, ట్రూజెట్, ఇండిగో, ఎయిర్‌ కోస్తా తమ సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 15 వరకు విమాన సర్వీసులు రాకపోకలను సాగిస్తున్నాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి వరకు 5,48,732మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి విమాన ప్రయాణం చేసినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015–16 ఏడాదికిగాను రేణిగుంట విమానాశ్రయం ‘బెస్ట్‌ టూరిస్ట్‌ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టు’ అవార్డును సొంతం చేసుకుంది.

అంతర్జాతీయానికి రాని అనుమతులు
ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తే 200మంది అంతర్జాతీయ, 55మంది డొమెస్టిక్‌ ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే సామర్థ్యం నూతన టెర్మినల్‌కు ఉంది. అయితే ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అనుమతులివ్వకపోవడంతో ప్రస్తుతం దేశీయ సర్వీసులే నడుస్తున్నాయి.

అంతర్జాతీయ సర్వీసులను నడపాలి..
చిత్తూరు, వైఎస్సార్‌ కడప, నెల్లూరు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు అనేక మంది వెళుతున్నారు. వీరికి అనువుగా రేణిగుంట నుంచి కనీసం వారానికి ఒక్క కనెక్టింగ్‌ ఫ్లైట్‌ను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుం ది. తిరుపతి పుణ్యక్షేత్రానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతర్జాతీయ విమానం ఇక్కడి నుంచి ఎగిరితే పేరుకు సార్థకత ఉంటుంది.
– శ్రీనివాసులు రెడ్డి, ప్రయాణికుడు

సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం..
రెండేళ్లలో నూతన టెర్మినల్‌లో ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం. రూ.కోట్లు వెచ్చించి ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సుందరీకరణ పనులు చేపట్టాం. విమాన సర్వీసులను విస్తరించాం. 2015–16 ఏడాదికి గాను ‘బెస్ట్‌ ఫ్రెండ్లీ టూరిస్ట్‌ ఎయిర్‌పోర్టు’గా అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉన్నతాధికారుల అనుమతులతో అంతర్జాతీయ విమానయాన సేవలను త్వరితగతిన ప్రారంభిస్తాం.    – హెచ్‌.పుల్లా, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement