ఉన్నత ఉద్యోగం వదలి..
సాక్షి,చిత్తూరు : ఉన్నత చదువులు చదివాడు. పేరు ముందు డాక్టర్ ఉండాలనే కల నెరవేర్చుకున్నాడు. విదేశీ ఉద్యోగం. నెలకు రూ. 6.5 లక్షల జీతం పొందాడు. ఉద్యోగ బాధ్యతలతో 14 దేశాలు చుట్టాడు. అరుుతే ఆ దేశాల్లో వ్యవసాయూనికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాడు. ప్రోత్సాహాన్ని చూసాడు. ఇదే స్ఫూర్తితో స్వదేశంలో అన్నదాత లను ప్రోత్సహిస్తే సంతృప్తికలుగుతుందని భావించాడు. అంతే ఉద్యోగం వదిలేశాడు. చిత్తూరు జిల్లాకు వచ్చి మామిడి రైతులను అతని తెలివితేటలతో ప్రోత్సహిస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా, తణుకు వద్ద దమ్మెన్ను గ్రామంలో పుట్టి.. మామిడిని విదేశాలకు ఎగుమతి చేరుుంచడమే ధ్యేయంగా పనిచేస్తున్న డాక్టర్ దుద్దుపూడి శ్రీనివాస్‌బాబు ఆదర్శ జీవితం ‘సాక్షి’ పాఠకులకు ఆదివారం ప్రత్యేకం.
రిటైర్డ్ తహశీల్దార్ రామకృష్ణ కుమారుడు దుద్దుపూడి శ్రీనివాస్‌బాబు. తండ్రి ఉద్యోగ విరమణ తరువాత బెంగళూరులో స్థిరపడ్డారు. ఈ క్రమంలో ఊటీ,పుట్టపర్తిలో ఇంటర్ పూర్తి చేసిన శ్రీనివాస్ బెంగళూరులో బీఎస్సీ గణితం డిగ్రీ పూర్తిచేశాడు. మలేషియాలో ఎంబీఏ కోర్సు చేశాడు. అక్కడే జయకృష్ణ హోల్డింగ్ కంపెనీ జనరల్ మేనేజర్‌గా నెలకు * 6.5 లక్షల జీతంతో 8 నెలలు పనిచేశాడు.
పేరు ముందు డాక్టర్ ఉండాలనే లక్ష్యంతో ఆర్గనైజేషన్ డెవలప్‌మెంట్ కన్సల్టెంట్ అనే విషయంపై పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందాడు. ఉద్యోగరీత్యా 14 దేశాలు తిరిగాడు. అక్కడి వ్యవసాయం, మార్కెటింగ్ విధానం, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. రైతులకు ఆ దేశాల్లో ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించాడు. ట్యాక్స్ మొదలు అన్నింటిలోనూ రైతులకు రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తుండడం గమనించాడు. స్వదేశంలో రైతులకు ప్రోత్సాహాన్ని అందివ్వాలనే కోరిక పుట్టింది. ఉద్యోగం వదిలేసి బెంగుళూరు చేరుకున్నాడు.
ఎగుమతులపై రైతులకు అవగాహన
చిత్తూరులో సోదరి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాడు. వారి మామిడితోటల పెంపకం, కాయలు కాసినా మార్కెటింగ్ చేసుకోలేని రైతుల పరిస్థితిని కళ్లారా చూశాడు శ్రీనివాస్. చిత్తూరు మామిడికి విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను గుర్తుచేసుకున్నాడు. మామిడి ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకూ రైతులకు ఉన్న అవగాహన లేమి,ఇబ్బందులు, దళారుల మోసం గమనించాడు. జిల్లా రైతులను ఒక్కతాటిపైకి తెచ్చి ఒకే బ్రాండ్ నేమ్ పై మామిడిని విదేశాలకు ఎగుమతులు చేయించడమే లక్ష్యంగా చేసుకున్నాడు.
రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ఎగుమతికి ఉపయోగపడే నాణ్యమైన మామిడి ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. ప్రతిరైతూ సొంతంగా మామిడిని ఎగుమతి చేసుకునే ందుకు అవసరమైన సర్టిఫికెట్ పొందే విషయంపై అవగాహన కల్పిస్తున్నాడు. విదేశీయులను ఇక్కడికే రప్పించి మామిడి ఎగుమతికి అనుమతులను సైతం ఇప్పిస్తున్నాడు. యూరఫ్‌కు సంబంధించిన గ్లోబల్ గ్యాప్ సర్టిఫికెట్, కోస్తారికాకు చెందిన రెయిన్ ఫారెస్ట్ అలియన్స్ అనుమతులను తెప్పించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ 50 ఎకరాల మామిడికి విదేశీ ఎగుమతి అనుమతులను తెప్పించాడు. ఇంకా చాలా అనుమతులు రావాల్సి ఉన్నారుు. యూఎస్, యూకే, హాలెండ్, స్విట్జర్లాండ్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు,అక్కడి వ్యాపారులు జిల్లాకు వచ్చి మామిడి తోటలను పరిశీలించి ఎగుమతి అనుమతులు ఇస్తున్నారు. జిల్లా మామిడి రైతాంగాన్ని ఒకే వేదికపైకి తెచ్చి సహకార సంఘాన్ని ఏర్పాటుచేసి ఒకే బ్రాండ్ నేమ్‌పై మొత్తం మామిడిని విదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.
రైతులకు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా... బెంగళూరు నుంచి వచ్చి అవసరమైనన్ని రోజులు ఇక్కడే ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. 2020 - 25 నాటికి మన దేశంలో వ్యవసాయరంగం ప్రథమ స్థానంలో ఉంటుందని శ్రీనివాసబాబు ‘సాక్షి’తో చెప్పాడు. చిత్తూరు రకం కాదర్, బేనిషా, ఇమామ్ పసంద్ మామిడి పండ్ల రుచి దేశంలో మరేచోట మామిడిలో లేదని, మార్కెటింగ్ సక్రమంగా చేసుకోగలిగితే రైతులు మంచి లాభాలు ఆర్జిస్తారని తెలిపారు.
ప్రభుత్వం మార్కెటింగ్, విదేశీ అనుమతులపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రైతు మామిడి ఉత్పత్తులను సొంతంగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించడమే తన లక్ష్యమన్నారు. బతకడం కోసం ఆన్‌లైన్‌లో ప్రాజెక్టు వర్కర్లు చేస్తానన్నాడు. మిగిలిన సమయమంతా రైతు సంక్షేమం కోసమేనని చెప్పాడు.