
సాక్షి, అమరావతి : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం.. చివరిక్షణంలో కుదుపులకు లోనైన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు. విక్రమ్ ల్యాండర్ దాదాపుగా చంద్రుడి ఉపరితలానికి చేరుకుందని, మన శాస్త్రవేత్తలను చూసి యావత్ భారత్ గర్విస్తోందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. చివరి ఘట్టంలో తలెత్తిన ఈ చిన్న ఎదురుదెబ్బ కూడా భావి విజయాలకు మెట్టుగా మలుచుకొని ముందుకుసాగాలని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో యావత్ దేశం ఇస్రో బృందానికి అండగా ఉందని, ఇస్రో శాస్త్రవేత్తల అసాధారణ కృషిని కొనియాడుతోందని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైన సంగతి తెలిసిందే. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని ఇస్రో చైర్మన్ కె.శివన్
తెలిపారు. డేటాను విశ్లేషిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను ఆసాంతం వీక్షించిన ప్రధాని మోదీకి శివన్ ఈ విషయం తెలియజేయగా.. ఆయన ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment