ప్రజలకు పండుగ | Indira Gandhi Stadium Ready For YS Jagan Oath | Sakshi
Sakshi News home page

ప్రజలకు పండుగ

Published Mon, May 27 2019 1:28 PM | Last Updated on Mon, May 27 2019 1:28 PM

Indira Gandhi Stadium Ready For YS Jagan Oath - Sakshi

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం చేస్తున్న ఏర్పాట్లు

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయం అందుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరి ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ప్రజలకు ఆరోజు పండుగే అవుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ముస్తాబవుతోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపైనగరంలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, పలు శాఖల అధికారులు, ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు,  వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆదివారం సమావేశమై చర్చించారు. కలెక్టర్‌  మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే అతిథులు, వీవీఐపీలు, వీఐపీలు, సామాన్య ప్రజానీకానికి కేటగిరీల వారీగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. మీడియాకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు.

స్టేడియంలో ఏర్పాట్లు ఇలా..  
ప్రొటోకాల్‌ ప్రకారం స్టేడియంలో సీటింగ్‌ను కేటగిరీల వారీగా  ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా ఏఏ కేటగిరిలో రాష్ట్ర గవర్నర్, జ్యుడీషియల్‌  అధికారులకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తారు. ఏ1 కేటగిరీలో ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఏ2 కేటగిరీలో పార్టీ నేతలు, ప్రముఖులకు సీటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. స్టేడియం గ్యాలరీల్లో సామాన్య ప్రజలకు అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేస్తారు. వివిధ క్యాటగిరీల  మధ్య ముందుగా బారికేడింగ్‌ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేదిక, మైక్‌ సిస్టం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, కూలర్లు, షామియానాలు, సందర్శకులకు మంచినీటి వసతి, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని 10 ప్రధాన కూడలి ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్రీన్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగ్, ఒన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్, సిద్ధార్థ కాలేజీ, పైపులరోడ్డు, ఇందిరాగాంధీ స్టేడియం వద్ద, పామర్రుతోపాటు మరో మూడు ప్రాంతాల్లో  ఎల్‌ఈడీ స్కీన్లు, షామియానాలు ఏర్పాటు చేసి మజ్జిగ, మంచినీళ్లను అందుబాటులో ఉంచుతారు.  

నిరాడంబరంగా ప్రమాణస్వీకారోత్సవం
వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు  ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రమాణాస్వీకారం చేయనున్నారని  పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ మోహన్‌రెడ్డి సూచనల మేరకు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సామన్య ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.  కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ అడిషినల్‌ సెక్రటరీ అశోక్‌బాబు, డీసీపీలు రవిశంకర్‌ రెడ్డి, హర్షవర్దన్‌ రాజు,  విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌ ఎమ్మెల్యేలు  వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు,  రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, వేమూరు ఎమ్మెల్యే మేరుగు నాగార్జున,  వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు  లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి  బొప్పన భవకుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి  అడపా సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement