AP: రాష్ట్ర ప్రతిష్టపై దాడి | CM YS Jagan Comments In Police Martyrs Memorial Program Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: రాష్ట్ర ప్రతిష్టపై దాడి

Published Fri, Oct 22 2021 2:04 AM | Last Updated on Fri, Oct 22 2021 3:49 PM

CM YS Jagan Comments In Police Martyrs Memorial Program Andhra Pradesh - Sakshi

గురువారం విజయవాడలో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో హోం మంత్రి మేకతోటి సుచరిత తదితరులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొత్త తరహా నేరాలు, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించి శాంతి భద్రతలను పరిరక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసుల సేవలను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్‌ 21న దేశ వ్యాప్తంగా అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. 1959 అక్టోబర్‌ 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్, ఆయన సహచరుల ధైర్యం, ప్రాణత్యాగాన్ని అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా 62 ఏళ్లుగా గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 
ఇలా దూషించడం సమంజసమా? 
► మావాడు అధికారంలోకి రాకపోతే ప్రతిరోజూ అబద్ధాలే వార్తలుగా, వార్తా కథనాలుగా ఇస్తాం.. అబద్ధాలనే డిబేట్లుగా ప్రతిరోజూ నడుపుతామని చెబుతున్న పచ్చ పత్రికలు, పచ్చ చానెళ్లను కూడా చూస్తున్నాం.  
► మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజాకొడుకు అంటామని దారుణమైన బూతులు వాడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని, ఆయన తల్లినుద్దేశించి ఇలాంటి మాటలు, బూతులు తిట్టడాన్ని అంతా చూస్తున్నాం. ఇలా దూషించడం కరెక్టేనా..? 
► ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రిని అభిమానించేవాళ్లెవరైనా తిరగబడాలి.. వాళ్లు రెచ్చిపోవాలి.. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి.. దానివల్ల గొడవలు సృష్టించాలని ఆరాట పడుతున్నారు. ఇదంతా సమంజసమేనా? అందరూ ఒక్కసారి ఆలోచించాలి.   
‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్, హోం మంత్రి సుచరిత, సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ సవాంగ్‌  
  

ఇక గెలవలేమని బెరుకు 
► మునిసిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ, మండల పరిషత్‌ ఎన్నికలు, చివరికి ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ పాలనను మెచ్చుకుంటూ ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దీంతో ఇక తమకు అధికారం దక్కే అవకాశం లేదని వారికి తెలిసిపోయింది కాబట్టే ఇలా చేస్తున్నారు. 
► చివరకు మన రాష్ట్రం పరువు, ప్రతిష్టలను కూడా దిగజారుస్తూ లేనిది ఉన్నట్లు డ్రగ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ అని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. వీరు టార్గెట్‌ చేస్తోంది ముఖ్యమంత్రిని, మనందరి ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్నీ కూడా. ఇది నామీద దాడి కాదు. మనం రాష్ట్రం మీదా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీదా దాడి.  
► మన పిల్లలను డ్రగ్‌ అడిక్టŠస్‌గా ప్రపంచానికి చూపించేలా దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. అది ఇది పచ్చి అబద్ధమని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వివరణ ఇచ్చినా... విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఆ వివరణను చూపిస్తూ మళ్లీ చెప్పినా.. చివరకు డీజీపీ పదేపదే ఇదే విషయాన్ని స్పష్టం చేసినా వినిపించుకోవడం లేదు. అక్కసుతో ఒక పథకం ప్రకారం క్రిమినల్‌ బ్రెయిన్‌తో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.  
 
పౌరుల రక్షణలో రాజీ పడొద్దు.. 
► నేరం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూపాల్లో దాడి చేస్తోంది. శాంతి భద్రతలు మనకు అత్యంత ప్రాధాన్యత అంశం. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. ఏమాత్రం రాజీపడొద్దని స్పష్టం చేస్తున్నా. 
► బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిపై కులపరమైన దాడులు, హింసకు పాల్పడితే కారకులు ఎవరైనా సరే ఉపేక్షించొద్దు. తీవ్రవాదం, అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించొద్దు.   
  
పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి  
ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులు కాగా అందులో 11 మంది మన రాష్ట్రానికి చెందినవారున్నారు. ప్రజాసేవలో అమరులైన ప్రతి పోలీసు సోదరుడికి, సోదరికి నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి  తెలియజేస్తున్నా. అధికారం చేపట్టిన నాటి నుంచి సమాజం పట్ల బాధ్యతతో మా పరిపాలన సాగుతోంది. పోలీసుల పట్ల కూడా అదే చిత్తశుద్ధి, బాధ్యతను చేతల్లో చూపిస్తూ వచ్చాం. 

భారీగా పోలీసు నియామకాలు  
► పోలీసుల సంక్షేమానికి గత సర్కారు 2017 నుంచి బకాయి పెట్టిన రూ.15 కోట్లు నిధులు కూడా విడుదల చేశాం. త్వరలో భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టబోతున్నాం. హోంగార్డుల గౌరవ వేతనం పెంచాం.  16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నియమించాం. వారందరికీ శిక్షణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. 
► కరోనా వల్ల మృతి చెందిన పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తే దానికి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా మరో రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని ఆదేశించాం. చికిత్స పరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్స్‌గ్రేషియా ఇతర సదుపాయాలను అందించి ఆదుకున్నాం. 
 
నవంబర్‌ 30లోగా కారుణ్య నియామకాలు  
కరోనాతో మృతి చెందిన పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాలకు ఊరట కల్పిస్తూ కారుణ్య నియామకాలన్నీ నిర్ణీత కాలపరిమితితో నవంబర్‌ 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. అక్కచెల్లెమ్మల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లు, దిశ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ బిల్లును ఉభయ సభల్లో ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఇప్పటికే పంపించాం. బాలికలు, మహిళల సంరక్షణ కోసం మహిళామిత్ర, సైబర్‌మిత్ర కార్యక్రమాలను వార్డు, గ్రామ స్ధాయిలోకి తీసుకువెళ్లాం. మహిళా హోంమంత్రి ఆధ్వర్యంలో పటిష్టంగా అమలు చేస్తున్న ఈ రక్షణ చర్యలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు, పురస్కారాలు కూడా లభించాయి.  

కొత్త నేరగాళ్లు
అధికారం దక్కలేదన్న అక్కసుతో రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. కొత్త నేరగాళ్లు వస్తున్నారు. చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. రథాలు తగలబెడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కోర్టుల్లో కేసులు వేయించి సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలనూ ఆపేయించారు. పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు అందడానికి వీల్లేదని అంటున్నారు. చివరికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని బోసిడీకే.. అంటే లంజాకొడకు అని బూతులు తిడుతున్నారు. ఇది నాపై దాడి కాదు.. రాష్ట్రంపైన దాడి. మన రాష్ట్రం, మన పిల్లలపై డ్రగ్స్‌ కళంకం మోపుతూ వారి భవిష్యత్తును నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారు.  
– ముఖ్యమంత్రి జగన్‌ ఆవేదన    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement