
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం చేయనున్న పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమాన్ని సామాన్యులు సైతం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్ ప్రమాణం చేయనున్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులతోపాటు ప్రజలు, కార్యకర్తలు కోసం కూడా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దాదాపు 30వేల మంది వీక్షించే విధంగా ఈ గ్యాలరీల్లో సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సూచన మేరకు ప్రజలు కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం కల్పించామన్నారు.
కార్యక్రమం నిమిత్తం రెండు ప్రధాన స్టేజిలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓ స్టేజిపై ప్రమాణ స్వీకార అధికార కార్యక్రమం, మరోదానిపై గవర్నర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఉంటారని తలశిల రఘురాం వెల్లడించారు. అలాగే ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కుటుంబ సభ్యులు, జడ్జిలకు ఓ గ్యాలరీ, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మరో గ్యాలరీని కేటాయించామని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఇతర వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాగా మైదానం ప్రాంగణంలోనూ, బయట కూడా ప్రజలు వీక్షించేలా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సామాన్యులు, కార్యకర్తలంతా వచ్చి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించవచ్చునని ఆయన ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment