గూడు గోడు | indiramma home construction | Sakshi
Sakshi News home page

గూడు గోడు

Published Mon, Jul 21 2014 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

గూడు గోడు

గూడు గోడు

- బిల్లుల కోసం ఇందిరమ్మ లబ్ధిదారుల నిరీక్షణ
- 118 రోజులుగా నిలిచిన చెల్లింపులు
- మొత్తం రూ.15 కోట్లకుపైగా బకాయిలు
- కొనసాగుతున్న 31,251 గృహ నిర్మాణాలు
- ఎంపికై మంజూరు కోసం చూస్తున్న వారు  21,912 మంది
- కార్యాలయాల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు

ఒంగోలు, కనిగిరి, మార్కాపురం: పేదవాడి ఇంటి నిర్మాణానికి అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి. 118 రోజులుగా ఒక్క రూపాయి కూడా గృహ లబ్ధిదారుల ఖాతాలకు జమ కాలేదు. 30 వేల మందికిపైగా గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 20 వేల మందికిపైగా అర్హులైన వారు రుణం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం మారడంతో ఇందిరమ్మ పథకానికే కాకుండా గృహ నిర్మాణశాఖలో పూర్తిస్థాయి మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. ఈ దశలో కనీసం నిర్మాణదశలో ఉన్న గృహాలకైనా రుణం అందుతుందా లేదా అనేది సందిగ్థంగా మారింది.
 
ఇదీ పరిస్థితి:
- జిల్లాలో గత 9 ఏళ్లలో 2,33,175 మంది గృహ నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,11,263 మందికి సంబంధించి రుణం మంజూరుకు గ్రౌండింగ్ ప్రక్రియ కూడా పూర్తిచేశారు. మిగిలిన 21,912 మందికిగాను 5,741 మంది గృహ నిర్మాణాల అకౌంట్ల దశ పూర్తయింది. మరో 16,171 మంది బ్యాంకు అకౌంట్లు పరిశీలన దశలోనే ఉన్నాయి.
- ఇందిరమ్మ పథకం మూడు దశల్లో, రచ్చబండ 3 దశల్లో, జీవో నంబర్ 171 తదితర స్కీముల కింద పేదవారి గృహ నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఇప్పటి వరకు 1,80,012 మంది గృహాల నిర్మాణం పురోగతిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ దశలోనే ఎన్నికలు రావడంతో కోడ్ పేరుతో అధికారులు రుణాల మంజూరుకు బ్రేక్ వేశారు.
- ఆ తరువాత ఎన్నికలు పూర్తయి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినా రాష్ట్ర విభజన నేపథ్యంలో అకౌంట్ల ఫ్రీజింగ్ పెట్టారు. దీంతో బడ్జెట్ ఉన్నా నిధులు విడుదల లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ గృహ నిర్మాణశాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే నిర్మాణాలు కొనసాగిస్తున్న వారికి మాత్రం నిధులు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఇంత వరకు ఎటువంటి రుణం విడుదల చేయలేదు.
- మార్చి 25వ తేదీన అకౌంట్ల లావాదేవీలు నిలిచిపోయాయి. ఇలా ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టిన దాదాపు 5 వేల మందికి రూ.9.42 కోట్ల రుణం తాలూకూ మొత్తం వారి వ్యక్తిగత ఖాతాలకు జమ కావాల్సి ఉంది.
 
31,251 మంది ఎదురుచూపులు:
 జిల్లాలో రుణానికి అర్హత పొంది కొంత మేర నిర్మాణాలు ప్రారంభించిన వారు 31,251 మంది ఉన్నారు. వీరిలో బిలో బేస్‌మెంట్ లెవల్ 2669 మంది, బేస్‌మెంట్ లెవల్‌లో 15334, లెంటల్ లెవల్ 3282, రూఫ్ లెవల్ 9966 మంది ఉన్నారు. ఇలా నిర్మాణాలు ప్రారంభించిన వారిలో ఇందిరమ్మ మూడో దశ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉండడం గమనార్హం.  
 మార్చి 25వ తేదీ నుంచి జూన్ నెలాఖరు వరకు జరిగిన ఇందిరమ్మ గృహాలకు సంబంధించి మరో రూ. 6 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమచేయాల్సి ఉంటుందని అంచనా.

ఆన్‌లైన్‌లో పెండింగ్ రూ.9.42 కోట్లు, ఇంకా ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సిన మొత్తం రూ.6 కోట్లు వెరసి జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.15 కోట్లపైగా రుణాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలకు జమచేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ మార్చి 24వ తేదీ వరకు కొనసాగుతున్న నిర్మాణాలకు బిల్లులు చెల్లించారు. కానీ 25వ తేదీ నుంచి వాటిని కూడా నిలిపివేశారు. మే 23వ తేదీతో ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ 24వ తేదీ నుంచి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆన్‌లైన్ లావాదేవీలను ప్రభుత్వం నిలిపివేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
రోజురోజుకూ పెరుగుతున్న నిర్మాణ వ్యయం:
ఇదిలా ఉంటే ఇంటి నిర్మాణానికి రుణం పెంచుతున్నామంటూ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా అవి పేదవాడికి పెద్దగా ఉపయోగపడటం లేదు.  నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరుగుతుండడమే దీనికి కారణం. ఇటీవలి వరకు రూ.250 నుంచి రూ.260 మధ్యలో ఉన్న సిమెంట్ బస్తా ధర ఏకంగా ఇటీవల రూ.300 నుంచి రూ.320 కు పెరిగింది. మరో వైపు ఇనుము టన్ను ధర కూడా రూ.48 వేల నుంచి రూ.52 వేలపైన పలుకుతోంది. ఇక బేల్దారి కూలీల విషయంలో కూడా భారీగా మార్పులు జరిగాయి. ఏడాది క్రితం వరకు రూ. 300-రూ.350 మధ్యలో ఉన్న కూలీ రేటు నేడు ఏకంగా రూ.400-రూ.450 మధ్యలో ఉండడం గమనార్హం. ఇసుకపై ఆంక్షలు కూడా ఇంటి  నిర్మాణానికి బ్రేకులు పడేలా చేశాయి. ఈ దశలో ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకొని నిర్మాణ రంగాన్ని  కొలిక్కి తీసుకువస్తే తప్ప పేదవాడి సొంతింటి కల సాకారమయ్యే అవకాశం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టి 40 రోజులు దాటినా ఇంత వరకు గృహ రుణాలపై ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
పీడీ ఏమంటున్నారంటే..
 దీనిపై గృహనిర్మాణ శాఖ పీడీ ధనుంజయ్‌ను వివరణ అడగ్గా రాష్ట్ర విభజన నేపథ్యంలో బిల్లుల నిధుల విడుదల అకౌంట్‌లపై ప్రభుత్వ స్థాయిలో ప్రక్రియ జరుగుతోందన్నారు. నెల రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నిర్మాణ దశలో ఉన్న గృహాలకు బిల్లులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. మంజూరు అనుమతి పొంది ప్రారంభం కాని ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు రావాల్సి ఉందన్నారు.

Advertisement
Advertisement