
పరిశ్రమలను అడ్డుకుంటున్న టీడీపీ
మాచర్ల టౌన్
అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేయించి, అక్రమ కేసులు పెట్టించి టీడీపీ నాయకులు పరిశ్రమల ఏర్పాటును అడ్డుకుంటున్నారని మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాచవరం మండలం చెన్నాయపాలెంలో సరస్వతీ సిమెంట్స్ ఏర్పాటుకు టీడీపీ నేతలు అవరోధం కల్పిస్తున్నారని ఆరోపించారు.
వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో పరిశ్రమ నెలకొల్పేందుకు మార్కెట్ విలువ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైతులను రెచ్చగొట్టి రిజిస్ట్రేషన్, కన్వర్షన్ చేసుకున్న భూములను ఆక్రమించుకోవాలని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఒకవైపు పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెబుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీ వారితో కలసి సరస్వతి సిమెం ట్స్‌ను అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఇందులో భాగంగానే విక్రయించేసిన భూముల్లో అక్రమంగా పంటలు వేయించారని, తీరా దీనిపై రైతులతో చర్చించేందుకు వెళ్లేవారిని గూండాలుగా చిత్రీకరించి కేసులు బనాయిస్తున్నారన్నారు. రైతు పక్షపాతిగా పేరొందిన దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డిని, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం దారుణమన్నారు.
యరపతినేనికి ఇది అలవాటే
గతంలో కూడా దాచేపల్లి ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల నిర్వాహకులను వివిధ సాకులతో బెదిరించి నగదు వసూలు చేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన చరిత్ర యరపతినేనిదని పిన్నెల్లి వ్యాఖ్యానించారు. వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉండి జైలుకి వెళ్లి ఆ తరువాత ఆ కుటుంబానికి డబ్బులిచ్చి రాజీ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కారంపూడి మండలం చినగార్లపాడులో గోవిందరెడ్డి భార్యపై దాడి చేసింది టీడీపీ నాయకులేనన్నారు.
పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడం, నగదు కోసం బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం, అమాయక కార్యకర్తలను రెచ్చగొట్టే ధోరణిని యరపతినేని మానుకోవాలని హితవు పలికారు. అధికార దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ యార్డు చైర్మన్లు మారం వెంకటేశ్వరరావు (లడ్డు), యరబోతుల శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ పురపాలక సంఘ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ లీడర్లు బోయ రఘరామిరెడ్డి, షేక్ కరిముల్లా, వైఎస్సార్‌సీపీ నాయకులు బిజ్జం నాగిరెడ్డి,మస్తాన్, రామిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.